ఇంకొంత కాలం, అవసరమైనపుడు మాట్లాడ్తా: లగడపాటి
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయాల పైన స్పందించారు. తాను రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నానని తెలిపారు. అవసరమైనప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని తెలిపారు.
మరికొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని లగడపాటి స్పష్టం చేశారు. ఆదివారం కర్నాటక రాష్ట్రం పావగడలో కమ్మ బాలికల వసతి గృహం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నానన్నారు. గత ఆరు నెలలుగా రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు.

ప్రస్తుతం మాట్లాడటానికి వీలు కాదన్నారు. అతి త్వరలో మాట్లాడే సమయం వస్తుందని, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రాజకీయాలకు దూరమవుతున్నానా, దగ్గరవుతున్నానా అన్నది ఇప్పట్లో చెప్పలేనని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కుల అభిమానం దురభిమానం కావొద్దన్నారు.
కాగా, లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగదని, విభజన జరిగితే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని సవాల్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ విభజనకు అంగీకరించింది. లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పెట్టిన సమయంలో లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్పేరే చల్లారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం విభజన జరగటంతో.. లగడపాటి ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాల నుండి తప్పుకున్నారు.












Click it and Unblock the Notifications