కుప్పంలో వ్యూహం తప్పుతోంది - ఎవరి వైపు మొగ్గుతోంది..!?
వై నాట్ 175. ఈ సారి కుప్పంలోనూ గెలవబోతున్నాం..ఇదీ సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట. కుప్పంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీ వ్యూహాలకు చంద్రబాబు స్పందించారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చే చంద్రబాబు..ప్రతీ మూడు నెలలకోసారి వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలోకి వెళ్తున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరికీ కుప్పం ప్రతిష్ఠాత్మకంగా మారింది. వ్యూహాలు మారుతున్నాయి. కుప్పం ఎవరికి దక్కుతుంది...

కుప్పం పైన సీఎం స్పెషల్ ఫోకస్..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబు నామినేషన్..ప్రచారానికి వెళ్లకపోయినా ఆయనకు కుప్పం ప్రజలు పట్టం కట్టారు. 2019లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన మాత్రమే గెలిచారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగానే విజయం సాధించింది. అదే విధంగా ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు సమయంలో కుప్పంను ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ గా మార్చింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా సొంత నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారని...తమ ప్రభుత్వం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేసిందని సీఎం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కుప్పంకు ప్రత్యేకంగా సీఎం జగన్ నిధులు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే పార్టీ తరపున భరత్ ను అభ్యర్ధిగా ప్రకటించారు.

వైసీపీ లెక్కలతో వ్యూహం మార్చిన చంద్రబాబు
కుప్పంలో వైసీపీ లక్ష్యం..అడుగులు అర్దం చేసుకున్న చంద్రబాబు వ్యూహం మార్చారు. కుప్పంలో పార్టీ నేతలతో నిరంతరం టచ్ లో ఉంటున్నారు. కుప్పంలో పట్టు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ నిర్ణయాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ప్రభుత్వం పైన నిరసనల్లో కుప్పంలో మాత్రం వెనుకడుగు వేయటం లేదు. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో హడావుడి ఉండేది కాదు. ఇప్పుడు రోడ్ షోలు - సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యువత, మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిని ప్రభుత్వంపైన స్థానికంగా పోరాటానికి చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు.

ప్రభుత్వ తాజా జీవో.. సభలకు అనుమతి నో
చంద్రబాబు కుప్పం పర్యటన ప్రారంభానికి ముందే ఉద్రక్తిత మొదలైంది. రోడ్లపై సభల నిర్వహణకు అనుమతి లేదంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి మేరకు చంద్రబాబు సభలకు అనుమతి లేదని స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటిస్తున్నాయి. తోపులాట చోటు చేసుకుంది. ప్రభుత్వం పథకాలు.. స్థానికంగా డెవలప్ మెంట్ ద్వారా పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసుల అడ్డంకులు..ప్రభుత్వ ఆంక్షలను హైలైట్ చేస్తూ తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తున్న సమయంలో.. చంద్రబాబు సభలను అడ్డుకోవటం టీడీపీ శ్రేణులు సవాల్ గా తీసుకుంటున్నాయి. దీంతో. పోలీసుకు స్థానిక టీడీపీ నేతలు ఎదురుతిరుగుతున్నారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయంగా ఎవరికి లాభం చేస్తుందీ.. ఎవరికి నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications