టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేరికలపై ట్విస్ట్..!
ఏపీలో ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా.. మరోవైపు రాజ్యసభ ఎన్నికలు ఆసక్తిరేపుతున్నాయి. ఇప్పటికే ఏకగ్రీవంగా మారిపోయినప్పటికీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించడానికి సమయం ఉండటంతో అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి ప్రజాప్రతినిధుల చేరికలపై సస్పెన్స్ నెలకొంది. దీంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విపక్ష టీడీపీ, జనసేన ఇవాళ దాదాపు 60 సీట్లలో తమ అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీకి ఇబ్బంది లేని స్ధానాల్లో తమ అభ్యర్ధులను ఇవాళ తొలి జాబితా రూపంలో ప్రకటించబోతున్నాయి. అయితే వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు, ఎంపీల చేరిక వ్యవహారంపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఈ నెల 22నే టీడీపీలో చేరాల్సి ఉన్న వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు పలువురు నేతలకు ఎదురుచూపులు తప్పట్లేదు.

వైసీపీలో ఎంపీ సీట్లు దక్కని మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు కృష్ణదేవరాయలతో పాటు పలువురు ఎంపీలు, అలాగే వసంత కృష్ణప్రసాద్, కొక్కిలిగడ్జ రక్షణనిధి, కొలుసు పార్ధసారధితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఈ వారంలో టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో ఇవి కాస్తా వాయిదా పడిపోయాయి. దీనికి కారణం టీడీపీ, జనసేన క్యాడర్ లో నెలకొన్న నిర్లిప్తతే. టికెట్ల పంపకాలపై పలుదఫాలు చంద్రబాబు, పవన్ చర్చలు జరిపినా అధికారిక ప్రకటనలు రాకపోవడంతో క్యాడర్ లో నిస్సత్తువ ఆవహించింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ, జనసేన తొలి దశ అభ్యర్ధుల ప్రకటన జరుగుతోంది.
ఈ ప్రకటన కారణంగా వైసీపీ నుంచి టీడీపీలోకి నేతల చేరికలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇవాళ దాదాపు 60 మంది అభ్యర్ధుల ప్రకటనతో ఇరు పార్టీల క్యాడర్ లో జోష్ వస్తుందని, అనంతరం చేరికలు కూడా పెట్టుకుంటే ఆ ఊపు కొనసాగుతుందని టీడీపీ అంచనా వేసుకుంటోంది. అందుకే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల చేరికను వాయిదా వేస్తూ వస్తోంది. మరోవైపు ఈ నెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికలతో చేరికలకు సంబంధం లేకపోవడంతో 26న ఈ చేరికల కార్యక్రమం పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications