ఢిల్లీ తాజా సంకేతాలు, పవన్ కేంద్రంగా - ఏపీ పొత్తుల్లో కొత్త లెక్కలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీకి ఆహ్వానం పలికినా అధికారికంగా స్పందన లేదు. ఇదే సమయంలో కొత్త పొత్తుల లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీతో జత కట్టేందుకు సిద్దమని లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి. పొత్తుల వ్యవహారంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ కీలకంగా మారారు. బీజేపీ కోసం వేచి చూడటమా..ఈ రెండు పార్టీలు వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లటమా అనేది తేల్చాల్సిన అంశం.
కొత్త లెక్కలు: ఏపీలో ఎన్నికల పొత్తులపై కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు..పవన్ కల్యాణ్ తొలి నుంచి ఆలోచన. పవన్ ను బీజేపీ ఎన్డీఏ లో భాగస్వామిగా భావిస్తోంది. పవన్ సైతం ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ టీడీపీతో పొత్తు ప్రకటించారు.

ఈ నిర్ణయం వెనుక కారణాలను బీజేపీ ముఖ్య నేతలను కలిసి వివరిస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ ముఖ్య నేతలు స్పందించ లేదు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ నేతలు ఉన్నారని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ సమయంలో పొత్తుల విషయంలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
లెఫ్ట్ పార్టీల ప్రతిపాదన: టీడీపీతో జత కట్టడానికి సిద్దమని సీపీఐ, సీపీఎం నేతలు ముందుకు వచ్చారు. బీజేపీతో పొత్తు లేకపోతే తాము కలిసి పని చేస్తామని స్పష్టం చేసారు. గతంలో ఈ పార్టీలతో పవన్ కలిసి పని చేసారు. అయితే, టీడీపీ జనసేన పొత్తు పైన మాత్రం ఆ రెండు పార్టీలు మాట్లాడటం లేదు. జనసేన పార్టీ అటు బీజేపీతో కలిసి ఉన్నంత వరకు ఆ పార్టీతో కలవటం సాధ్యపడదని చెబుతున్నారు.
ఇటు టీడీపీ, బీజేపీతో కలిసి పని చేయాలనేది పవన్ ఆలోచన. కానీ, టీడీపీతో కలిసే అంశం పైన ఢిల్లీ బీజేపీ ముఖ్యుల నుంచి ఇప్పటి వరకు సానుకూల సంకేతాలు లేవు. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీలు, లేకపోతే టీడీపీతోనే ముందుకు వెళ్లాలనేది పవన్ ఆలోచనగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

బీజేపీ నిర్ణయం కోసం: బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో వారి సహకారం ఎన్నికల సమయంలో అవసరమనే అభిప్రాయంతో టీడీపీ నేతలు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తరువాత వారి ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. పట్టభద్రుల స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా లెఫ్ఠ్ పార్టీల మద్దతు తీసుకోవటంతో రెండు సీట్లను టీడీపీ గెలుచుకుంది.
వచ్చే ఎన్నికల్లోనూ ఓటింగ్ పరంగా బీజేపీ కంటే లెఫ్ట్ పార్టీలతోనే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ నిర్ణయం కోసం వేచి చూసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీలు.. కలిసి రాకుంటే టీడీపీ, జనసేన, వామపక్షాల కూటమి వైసీపీకి ప్రత్యర్ధిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications