నేడు ఏపీలో తేలికపాటి వర్షాలు.. పిడుగులు పడే అవకాశం; ఐఎండీ సూచన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురియడంతో పాటు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసాయి. బంగాళాఖాతంపైన ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు, ఝార్ఖండ్ నుంచి ఒరిస్సా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో నిన్న కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసాయి.
ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పాట్లు సంభవించాయి. అయితే ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ఈ ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. నిన్న రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలను ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా రాజాంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

కాకినాడలోని చొల్లంగి లో 5. 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాకినాడలోని జగ్గంపేటలో 5.2 సెంటీమీటర్లు, అనకాపల్లిలోని కొత్తకోటలో 4.7 సెంటీమీటర్లు, కాకినాడలోని కిర్లంపూడి లో 3.5 సెంటీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం లో 3.4 సెంటీమీటర్లు, విశాఖపట్నంలోని పెదగంట్యాడ లో 3.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది.
అయితే పశ్చిమ విదర్భ వరకు విస్తరించిన ద్రోణి, నిన్న కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం కారణంగా నేడు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అవకాశం ఉందని, పిడుగులు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారత వాతావరణ శాఖ ఒక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే నేడు రాయలసీమలో మాత్రం వేడితో కూడిన పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తానికి నేడు ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పటంతో రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications