నారా లోకేష్ యువకుడిని నడిపించాడు: ఫ్యామిలీలో వెలుగు నింపారు
గుంటూరు/ ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఓ కుటుంబంలో వెలుగులు నింపారు. స్కోలియోసిస్‌తో బాధపడుతున్న యువకుడిని ఆర్థికంగా ఆదుకుని ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గా ఉంది. త్వరలోనే అతడు పూర్తిస్థాయిలో నడవగలడని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
కడప జిల్లా కసరపాడు పిడుగుపల్లికి చెందిన శ్రీనివాసులు, రమణమ్మ దంపతుల కుమారుడు వంశీకృష్ణ. ఇంటర్ చదువుతున్న వంశీకృష్ణ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే స్కోలియోసిస్ పార్స్వగూని బారిన పడ్డాడు. అప్పట్లో వెంటనే ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేకపోవడంతో వ్యాధి ముదిరింది. క్రమంగా నడకకు దూరమయ్యాడు.

వంశీకృష్ణ తల్లిదండ్రులు మేకే విష్ సంస్థ సహాయంతో ఆగస్టు 20న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేష్‌ను కలిశారు. వంశీకృష్ణ పరిస్థితిని చూసి చలించిపోయిన లోకేష్ అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వంశీకృష్ణ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4.5 లక్షలు మంజూరు అయ్యేలా చూశారు.
గుంటూరులోని మల్లిక స్పయిన్ సెంటర్‌లో వంశీకృష్ణకు సర్జరీ పూర్తి అయ్యింది. ప్రస్తుతం అతడు కూర్చోవడం, నిలబడటం చేయగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు. తమ కొడుకు పూర్తిగా కోలుకున్న తర్వాత నారా లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని వంశీకృష్ణ తల్లి చెప్పారు.
ఇదిలావుంటే కార్యకర్తలే తమ పార్టీ ప్రచారకర్తలని టీడీపీ యువ నేత నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజిలో కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని శుక్రవారం లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగబ్బాయిలా పేపరు, చానెల్ పెట్టమన్నారు. జగన్ అబ్దదాలను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్ నిరోధానికి టీఎన్‌ఎస్‌ఎఫ్ కృషిచేస్తుందని కార్యకర్తల శిక్షణాశిబిరంలో నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరాంలో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల కార్యకర్తలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications