జగ్గడు దావోస్ కు ఎందుకు వెళ్ళాడో? ఇదేం రౌడీయిజం; వీపులు మీకూ ఉంటాయ్: లోకేష్
రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రులు, నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంటే, లోకేష్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నిత్యం వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను, జగన్ పరిపాలన అసమర్థతను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్.

జగన్ దావోస్ పర్యటనపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే తాజాగా జగన్ దావోస్ పర్యటన ను టార్గెట్ చేసిన లోకేష్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా ఉంది జగ్గడి దావోస్ పర్యటన అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. సింగడు అద్దంకి ఎందుకో పోయాడో ఎందుకు వచ్చాడో తెలీదు అనే మన తెలుగు సామెతను జగ్గడు మళ్లీ గుర్తుకు తెచ్చారు అంటూ లోకేష్ విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని జగ్గడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు లోకేష్.

జగ్గడు దావోస్ ఎందుకు వెళ్ళారో.. ఏం తెచ్చారో.. లోకేష్ ఎద్దేవా
జగ్గడు అసలు దావోస్ ఎందుకు పోయారో...ఏమి తెచ్చారో ఎవరికీ తెలీదు. అసలే అంతంత మాత్రం గా ఉన్న ఆర్థిక పరిస్థితికి స్పెషల్ ఫ్లైట్ విలాసాల ఛార్జీల మోత అదనపు భారం తప్ప...రాష్ట్రానికి పైసా లాభం లేదు అంటూ లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు. ఇక మరోపక్క వైసీపీ నేతలు జగన్ దావోస్ పర్యటనలో పెట్టుబడులు భారీగా వచ్చాయని,ఏపీలో పెట్టుబడి పెట్టటం కోసం ఆసక్తిని కనబరిచిన పెట్టుబడి దారులు అంటూ జగన్ దావోస్ పర్యటన ఏపీకి పెట్టుబడులను ఆకర్షించింది అంటూ చెప్తున్నారు.

జగన్ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో చెప్పిన లోకేష్
అంతేకాదు జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో చెబుతానంటూ పేర్కొన్న లోకేష్ జగన్ రెడ్డి పాలనలో విద్వేషం విధ్వంసం విషాదం రాజ్యమేలుతున్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల లో సాధించింది శూన్యం, రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం ఖాయమంటూ లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో రామతీర్థం రాముని తల నరికివేత విద్వేషం అని, ప్రజావేదిక కూల్చివేత విధ్వంసం అని, అలాగే ఎల్జీ పాలిమర్స్ ఘటన విషాదమని లోకేష్ పేర్కొన్నారు.

మీ వీపులు విమానం మోత మోగుతాయి.. కర్నూలు మేయర్ వ్యాఖ్యలపై లోకేష్ ఫైర్
ఇక మరోవైపు తాజాగా కర్నూలు మేయర్ బి వై రామయ్య విలేకరులపై వీపులు వాయ కొడతాం అని చేసిన వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు.వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారు. అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారు అంటూ పేర్కొన్న లోకేష్, ఈ వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం? అంటూ ప్రశ్నించారు.
అధికారం మత్తులో నోరు పారేసుకో వద్దని హితవు పలికారు. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయి అంటూ లోకేష్ పేర్కొన్నారు. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అనినాలుగు కోట్లకి పైగా వున్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు అని లోకేష్ వెల్లడించారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకి క్షమాపణ చెప్పండని లోకేష్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications