Macharla Assembly Election 2024 Results LIVE: మాచర్ల గడ్డ ఎవరి అడ్డా - బస్తీ మే సవాల్..!!
మాచర్ల అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: మాచర్ల ఈ సారి ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన నియోజకవర్గం. టీడీపీ, తెలుగుదేశ్ పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకం. వైసీపీ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచిన పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా పోరు సాగింది. పోలింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. మరి...మాచర్ల లో గెలుపెవరిది.
పల్నాడులో ఉత్కంఠ
మాచర్లలో పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ వైసీపీ అభ్యర్ది పిన్నెల్లి కోసం జగన్ ప్రచారం చేసారు. పిన్నెల్లిని గెలిపిస్తే ఈ సారి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అటు టీడీపీ నుంచి ఏరికోరి జూలకంటి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు బరిలోకి దించారు. పల్నాడులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. ప్రచారం వరకు ప్రశాంతంగా కనిపించినా...పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ కు దిగుతున్నారనే ఆరోపణలతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి పిన్నెల్లి అక్కడ ఈవీఎం ధ్వంసం చేసారు.

హోరా హోరీ పోరు
ఈవీఎం ధ్వసం విషయంలో పిన్నెల్లి పైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడులో వరుసగా మూడు రోజులు హింసాత్మక ఘటనలు కొనసాగాయి. రెండు దశాబ్దాలుగా వైసీపీకి కంచుకోటగా ఉన్న మాచర్లలో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందు కోసం బ్రహ్మారెడ్డి తీవ్రంగా శ్రమించారు. అటు పిన్నెల్లి సైతం తన పట్టు కొనసాగించే ప్రయత్నం చేసారు. స్థానికంగా సామాజిక వర్గాలు సైతం రెండు పార్టీలకు కీలకంగా మారాయి. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావటంతో తామే విజయం సాధిస్తామని వైసీపీ నమ్మకం పెట్టుకుంది.
గెలుపు దక్కేదెవరికి
ప్రభుత్వ పథకాలు..పిన్నెల్లికి స్థానికంగా ఉన్న పట్టు తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయిదేళ్ల కాలంగా ప్రభుత్వంతో పాటుగా పిన్నెల్లి సోదరుల పైన వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. బ్రహ్మారెడ్డికి ఉన్న అనుచర వర్గం ఈ సారి గెలుపు కోసం కష్టపడి పని చేసింది. పిన్నెల్లి సోదరులు చేసిన వ్యవహారం పైన స్థానిక ప్రజల్లో ఆగ్రహం ఉందని చెబుతున్నారు. దీంతో..ఈ సారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని టీడీపీ నమ్మకంతో ఉంది. దీంతో..ఇక్కడ ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications