స్పీకర్‌గా చారి బాధ్యతలు, పొంగిపోయా: కెసిఆర్

ఇది ఓ చిరస్మరణీయ ఘట్టమని, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని కెసిఆర్ అన్నారు. సభాపతిగా ఎన్నికైన మధుసూదనాచారికి అభినందనలు తెలిపారు. ఉద్యమ నిర్మాణంలో, వ్యూహరచనలో సభాపతి నాడు ఎన్నో సూచనలు చేశారన్నారు. పట్టుదలకు మారుపేరు మధుసూదనాచారి అన్నారు.
శాసనసభ వ్యవహారాల్లో సభాపతికి అందరి సహకారం ఉంటుందని చెప్పారు. తెలంగాణ తొలి శాసన సభలో సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాయని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలంగాణ శాసన సభలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన మనస్సు ఉప్పొంగిపోయిందన్నారు. ఉద్యమకారులే తెలంగాణ సభను నడుపుతున్నారన్నారు. సభను చూస్తుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయన్నారు.
మల్లు భట్టి విక్రమార్క
సభాపతిగా ఏకగ్రీవం అయ్యేందుకు తాము అందరం ఎలా అయితే సహకరించామో... ప్రజా సమస్యల విషయమై సభాపతి కూడా అలాగే రాజకీయాలకు అతీతంగా సహకరించాలని మళ్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇది చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు ఆనందంగా ఉందని బిజెపి ఎల్పీ లక్ష్మణ్ అన్నారు. మధుసూదనాచారి స్పీకర్‌గా చరిత్రలో నిలిచిపోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అందరి అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశమివ్వాలని, సభ నడపడంలో తమ సహకారం ఉంటుందని మజ్లిస్ సభ్యుడు ఖాద్రీ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశమివ్వాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన ముగ్గురం గిరిజనులమేనని, తాము మొదటిసారి మాట్లాడుతున్నందున కాస్త భయంగా ఉందని వ్యాఖ్యానించారు.
మధుసూదనాచారి తనకు నేర్పిన రాజకీయ పాఠాన్ని మర్చిపోలేనని ఈటెల రాజేందర్ అన్నారు. మంచి ప్రజా నాయకుడిని స్పీకర్‌గా ఎంచుకోవడం సంతోషకరమని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. అనేక త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందనే విషయమై ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. శాసన సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలని, ఏ పార్టీ అని కాకుండా.. ప్రజలకు ఉపయోగపడే విధమైన సలహాలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. సభాపతి ఎవరికీ నమ్మిన బంటు కాదని ప్రజలకు నమ్మిన బంటు అన్నారు. కాగా, అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.
డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ జారీ అయింది. ఎల్లుండి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. తెరాస పద్మా దేవేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications