తిరుపతిలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే..: అరుదైన అవకాశం
Maha Shivratri 2025: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు ఆరంభం అయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు ఆలయ అర్చకులు. సర్వదేవతలనూ ఆహ్వానించారు.

ఈ తెల్లవారు జామున ధ్వజారోహణంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది.
పంచమూర్తులైన శ్రీసోమస్కంధమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారు, శ్రీవినాయక స్వామి, శ్రీచండికేశ్వరస్వామి, శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో తెల్లవారు జామున 5: 20 నిమిషాలకు మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
ఇందులో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు అర్చకులు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభాన్ని అభిషేకించారు.
దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణభట్టర్ శ్రీస్వామినాథ గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఫిబ్రవరి 27న కల్యాణోత్సవం, ఫిబ్రవరి 28న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.












Click it and Unblock the Notifications