తిరుమలలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Tirumala: తిరుమలలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమలకు వెళ్తోన్న ఓ కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
రెండవ ఘాట్ రోడ్డులో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన భక్తులు కారులో తిరుమలకు బయలుదేరారు. ఈ ఉదయం కారు తిరుమల అలిపిరి టోల్ గేట్ దాటుకుని రెండో ఘాట్ రోడ్డులోకి ప్రవేశించింది. భాష్యంగార్ల సన్నిధి మలుపు వద్ద ఉన్నట్టుండి కారు అగ్నిప్రమాదానికి గురైంది. కారులో మంటలు చెలరేగాయి.

వెంటనే డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. కారును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. ప్రయాణికులు కారు దిగి దూరంగా వెళ్లిపోయారు. కారు మొత్తం దగ్ధమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఘాట్ రోడ్డు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
రెండు రోజుల వ్యవధిలో తిరుమలలో రెండు కార్లు అగ్నికీలల మధ్య చిక్కుకోవడం ఇది రెండోసారి. ఈ నెల 18వ తేదీన తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమైంది. కౌస్తుభం అతిథిగృహం పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన సంభవించింది. కౌస్తుభం పార్కింగ్ స్థలంలో నిలిపివుంచి డస్టర్ కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు.. కారులో నుంచి పొగ రావడాన్ని గుర్తించారు. వెంటనే కిందికి దిగి బయటికి వెళ్లారు. దీనితో ప్రమాదం తప్పినట్టయింది. కారు ఇంజిన్, ముందు భాగం మొత్తం మంటల బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న భక్తులు కారు వెనుక భాగం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.












Click it and Unblock the Notifications