ట్విస్ట్‌లు: కాల్ మనీ పేరుతో మూడు బిజినెస్‌లు, ఒత్తిళ్లు ఉన్నాయా?
విజయవాడ: కాల్ మనీ దందా రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. కాల్ మనీ దందాకు ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. బెజవాడలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అందులో ఎక్కువ మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు.
దాదాపు మూడు లక్షల మంది వరకు పొట్ట చేత బట్టుకొని వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఎక్కువ మంది కూరగాయలు, పండ్లు, ఫలహార (టిఫిన్ సెంటర్) కేంద్రాలు, ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి అవసరం నిమిత్తం కాల్ మనీ దందా చేసేవారు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు.
వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కాల్ మనీ దందా చేసేవాళ్లు... రూ.5 నుంచి రూ.35 వరకు వారికి వడ్డీకి ఇస్తున్నారు. వారి నుంచి ఎక్కువ వడ్డీని పిండుకుంటున్నారు. తద్వారా ఇచ్చిన దాని కంటే ఎన్నో రెట్లు కాల్ మనీ దందా చేసే వారు లబ్ధిపొందుతున్నారు.

కాల్ మనీ దందా చేసే వారి ఆగడాలు తట్టుకోలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. కాల్ మనీ బాధితుల్లో నిరు పేదల నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి సాక్షాత్తు మంత్రి కూడా బాధితుల జాబితాలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
కాల్ మనీ దందా చేసేవారు ప్రధానంగా చిన్న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలుస్తోంది. వారు డబ్బులు ఇవ్వకుండా మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు కూడా వెనుకాడటం లేదనే విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి.
చదువు సంధ్యలు లేకుండా కోట్లు!
కాల్ మనీ దందా చేసేవారు ఎక్కువ మంది పెద్దగా చదువుకోలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ వ్యాపారంతో వారు కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ కాల్ మనీ వెనుక బడా బడా నాయకులు ఉండటం వల్లే దందా సాగుతోందని అంటున్నారు. కాల్ మనీ దందాలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం నాడు చెప్పారు.
కాల్ మనీతో పాటు..
నిందితులు కాల్ మనీ ముసుగులో ఆస్తుల తనకా, అమ్మాయిలను మోసగించడం వంటి తదితర మూడు వ్యాపారాలు కూడా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించకుంటే ఆస్తులను రాయించుకోవడం, మహిళలు అయితే వారిని వ్యభిచార వృత్తిలోకి దింపే ప్రయత్నం చేయడం జరుగుతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కాల్ మనీ నిందితుల పైన నిర్భయ కేసు కూడా నమోదయింది. అయితే ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో తమ పేర్లు ఎక్కడ బయటపెడతారోనని పలువురు నేతలు అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు.
కాల్ మనీ కేసులో ఒత్తిళ్లు వస్తున్నాయా?
కాల్ మనీ బాధితులు హైకోర్టులో పిల్ వేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, కాల్ మనీ కేసు విచారణలో ముందుకు వెళ్లవద్దని పోలీసుల పైన ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. టాస్క్ ఫోర్స్ వద్దకు బాధితులు ఆదివారం వరుస కట్టారు. మరోవైపు కాల్ మనీ విషయమై చంద్రబాబు సీరియస్‌గా స్పందిస్తున్నారు.
బాధితులు బయటకు
కాల్ మనీ బాధితులమంటూ పలువురు బయటకు వస్తున్నారు. సింగ్ నగర్‌కు చెందిన చిన్నారి, శ్రీనివాస్ దంపతులు బయటకు వచ్చారు. తాము కాల్ మనీ వల్ల చాలా నష్టపోయామని చెబుతున్నారు. కాల్ మనీ ద్వారా అవసరానికి రూ.ఒకటిన్నర లక్షలు అప్పు చేశామని, ఇప్పటి వరకు రూ.9 లక్షలు చెల్లించినా ఇంకా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాల్ మనీ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేల సహా ప్రజాప్రతినిధులు ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
విచారణ ప్రారంభించాం: చినరాజప్ప
కాల్ మనీ నిందితుల పైన విచారణ ప్రారంభించామని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. కాల్ మనీ వ్యవహారం వెనుక ఎంతటి వారు ఉన్న వదిలేసే ప్రసక్తి లేదని చెప్పారు. నిందితుల పైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications