దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చంద్రబాబు మాటలున్నాయన్న వైసీపీ మాజీ మంత్రి
హర్యానా ఎన్నికల ఫలితాలను, ఏపీలో ఎన్నికల ఫలితాలలోపోల్చి, ఈవీఎంలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ పైన సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. దీంతో చంద్రబాబును టార్గెట్ చేసి వైసీపీ మాజీ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు.తాజాగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై లెక్కలేనన్ని సార్లు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుండటం సిగ్గు చేటని మండిపడ్డారు.
చంద్రబాబుకు మేరుగు నాగార్జున కౌంటర్
చంద్రబాబు అవకాశవాద రాజకీయం చేస్తారని, బీజేపీతో కలసి ఉంటే ఓ మాట, లేకుంటే మరో మాట.. ఎన్నికల్లో గెలిస్తే ఓ మాట, ఓడితే మరో మాట ఫిరాయించే చంద్రబాబు అంటూ అసహనం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన నీతులు చెప్తుంటే, ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అభివర్ణించారు.

ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయి
2014 ఎన్నికల తర్వాత చాలా పార్టీలు, మేథావులతో పాటు, ప్రజల్లో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు వచ్చాయని పేర్కొన్న మేరుగు నాగార్జున, వాటికి హేతుబద్ధతతో సమాధానం చెప్పాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం బాధాకరమని అన్నారు. అందుకే ప్రజల్లో వచ్చిన అనుమానాలు తీర్చడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం, విశ్వాసం పెంచడానికి తమ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు.
హర్యానాలోనూ ఆశ్చర్యకర ఫలితాలు
ఆ క్రమంలోనే తాము ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు కోరామన్నారు. ఎన్నికలు జరిగి నెలలు గడిచినా, ఆయా జిల్లాల్లో కొన్ని ఈవీఎంలు ఫుల్ ఛార్జింగ్‌తో ఉండడం, పోలింగ్ ఓట్లు, కౌంటింగ్ ఓట్ల మధ్య వ్యత్యాసాలు అనుమానాలు మరింత బలపడేలా చేశాయని మేరుగు నాగార్జున వెల్లడించారు. తాజాగా ఏపీలో వచ్చిన విధంగానే హర్యానాలోనూ ఆశ్చర్యానికి గురి చేసేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
జగన్ ట్వీట్ లో తప్పేంటి
ఆ ఫలితాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తావించారు. అందుకే హర్యానా ఎన్నికల ఫలితాలకు, ఇక్కడ మన రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు తేడా లేదని, అక్కడా అవే అనుమానాలు ఉన్నాయని జగన్ ట్వీట్ చేశారని తెలిపారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగితేనే, ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని జగన్ పేర్కొన్నారని మాజీమంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.
ఈసీపై బలపడుతున్న అనుమానాలు
మన రాష్ట్రంలో పోలైన ఓట్ల ప్రకారం చూస్తే.. ఎంపీ సీట్లలో 14 కూటమికి, 11 వైయస్సార్‌సీపీకి రావాలని ఎన్‌డీఆర్ సంస్థ ఏకంగా ఈసీకి నివేదికను పంపిందని ఆయన వెల్లడించారు. ఇంత స్పష్టమైన ఆధారాలతో, సాంకేతిక అంశాలతో నివేదించినా సరే, ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదన్నారు. ఇదే అనుమానాలకు కారణం అన్నారు . ఈ చర్యలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఉన్న నమ్మకాలను వమ్ము చేస్తాయని నాగార్జున పేర్కొన్నారు. చంద్రబాబు తీరుపైనా నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications