కొడాలి నానీ బాటలో మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ .. చంద్రబాబుపై ఘాటుగా ..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. మంత్రి కొడాలి నాని మాత్రమే పరుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కొడాలి నానీ బాట పట్టారు. చంద్రబాబు నాయుడు,లోకేష్ లను టార్గెట్ చేసుకుని ఆయన కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకి అధికారం పోవటంతో మైండ్ దొబ్బింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

పోలవరం ప్రాజెక్ట్ పనులపై టీడీపీది అనవసర రాద్దాంతం అన్న అనీల్ కుమార్ యాదవ్
పోలవరం రివర్స్ టెండరింగ్‌తో దాదాపు వెయ్యికోట్లు ప్రజాధనం ఆదా అయిందని టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేవలం 30శాతమే జరిగిందని కానీ టీడీపీ 74 శాతం పూర్తి చేశామని అబద్ధం చెప్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ హయాంలో కేవలం 35 % పనులు మాత్రమే
పోలవరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 55,000 కోట్లు, నాడు టీడీపీ హయాంలో రూ. 17,000 కోట్లు ఖర్చు చేశారు, ఇది కేవలం 35% మాత్రమే. కానీ, ఈ ప్రాజెక్టులో 75% పూర్తయిందని టిడిపి వాదిస్తోంది.
ఇక చంద్రబాబు మూడేళ్ల పాటు 2014, 2015, 2016 సంవత్సరాల్లో పడుకున్నారని, ఈ ప్రాజెక్టుపై 2 సంవత్సరాలు మాత్రమే పనిచేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు మైండ్ దొబ్బిందని మంత్రి వ్యాఖ్య
తాము అధికారం చేపట్టి ఆరు నెలలు కూడా గడవక ముందే కావాలని రచ్చ చేస్తున్నారన్నారు. తెలుగుదేశం అబద్ధాలు విని ప్రజలు విసిగిపోయారన్న అనిల్ కుమార్ యాదవ్అందుకే ప్రజలు టీడీపీకి 23 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్న దేవినేని ఉమా కళ్ళు దొబ్బాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మైండ్ దొబ్బి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని మారినా చంద్రబాబు బుద్ధి మారడం లేదన్నారు.

వర్మ సినిమా ట్రైలర్ చూసా ... తియ్యగా ఉందని వ్యాఖ్యానించిన మంత్రి అనిల్
మొదటి నుండి చంద్రబాబుది వంకర బుద్ధి అందుకే ప్రజలు తగిన శాస్తి చేశారన్న్నారు .ఇక తాజాగా వర్మ బాబుని,కొడుకుని అలా పెట్టి సినిమా తీశాడు. వర్మ ట్రైలర్ చూశా .. తియ్యగుంది అని వ్యాఖ్యానించారు. కొడుకుని అలా చూసుకోలేక చంద్రబాబు బాధపడుతున్నాడని వయస్సు కూడా పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు . చంద్రబాబు సింగపూర్ వెళ్లి ట్రీట‌్‌మెంట్ చేయించుకుంటే మంచిది అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మంత్రి అనీల్ వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయనాయకుల భాషపై పెద్ద చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications