జగన్ కు బుద్ది మాత్రం మారలేదు, వైసీపీలో గురువుకు తగ్గ శిష్యులు, మంత్రి ఫైర్
గత ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విపత్తు సమయంలో కూడా సైకోలాగా ప్రవర్తిస్తున్నారని, అవివేకంతో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎమ్ డీ. ఫరూక్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని మంత్రివర్గంతో, సంబందిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రతిపాదికన పనులు చేయిస్తుంటే మాజీ సీఎం జగన్ సీఎంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ సైకో తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, కావాలనే వైసీపీ నాయకులను రెచ్చగొట్టించి కూటమి ప్రభుత్వంపైన లేనిపోని నిందలు వేస్తున్నారని మంత్రి ఎన్ఎం డీ ఫరూక్ ధ్వజమెత్తారు.

వైసీపీ నాయకులకు సిగ్గు,శరం ఉంటే వరద సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు చేతనైన సహాయం చేసి వారికి న్యాయం చేయాలని, చంద్రబాబు ప్రభుత్వంలో లోపాలు ఏమైనా ఉంటే వాటికి ప్రజలు వివరించాలని మంత్రి ఫరూక్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులకు ఎలాంటి కష్టం రానివ్వకుండా వారిని ఆదుకుంటుంటే ఏం చెయ్యాలో తెలీక పిచ్చిపట్టిన వైసీపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఫరూక్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో ఎప్పుడు ఏ సమస్యల్లో ఉన్నా ప్యాలస్ నుండి బయటకు రాకుండానే ఐదు సంవత్సరాలు కాలం గడిపేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ కి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు పరిష్కరించే ధైర్యం లేదని, ఇప్పుడు ఆయన బాటలోనే ఆ పార్టీ నాయకులు పయనిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని మంత్రి ఫరూక్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరద సహాయక చర్యల్లో పాల్గొనలేదని వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై మంత్రి ఫరూక్ స్పందించారు.
వైసీపీ నాయకుల ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. అయినా కూడా పవన్ కల్యాణ్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి నిత్యం అధికారులతో సమావేశాలు నిర్వహించి వరద సహాయక చర్యల్లో పాల్గొని ఎలాంటి చర్యలు తీసుకోవాలని విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారని, ఆ విషయం వైసీపీ నాయకుల కంటికి కనబడటం లేదా అంటూ మంత్రి ఫరూక్ వైసీపీ నాయకులను ప్రశ్నించారు.

వరద బాధితులను ఆదుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ తో సహా ఆ పార్టీ నాయకులు ఎంతెంత విరాళాలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి అందించారు అంటూ వివరాలు చెప్పడానికి బహిరంగ చర్చకు రావాలని మంత్రి ఫరూక్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. అంతకు ముందు విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి ఫరూక్ పర్యటించి అక్కడ సహాయ చర్యల్లో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ముస్తఫా మసీదు వీధి, డాబా కోట్ల రోడ్డు, అజిత్ సింగ్ నగర్ తదిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఫరూక్ ఇక్కడి మసీదులను పరిశీలించి ఎంత నష్టం జరిగిందనే వివరాలు తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మంత్రి ఫరూక్ ట్రాక్టర్ లో పర్యటించారు. ఇదే సమయంలో వరద బాధితులకు తాగునీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర ఆహార పదార్థాలను మంత్రి ఫరూక్ పంపిణీ చేశారు.
మసీదుల వారీగా దెబ్బతిన్న సామాగ్రి, పరికరాలు నష్టాలపై అంచనా వేసి ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి ఫరూక్ మైనారిటీ శాఖ సీఈవోను ఆదేశించారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఓ సైకో అంటూ మంత్రి ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల తీరు చూస్తుంటే ఒక సైకో శిష్యుల కూడా సైకో లే అని అర్థమవుతుందని మంత్రి ఫరూక్ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications