చెప్పు వ్యాఖ్యలు: 'జగన్ ఓ ఉన్మాది', 'ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి'
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుని చెప్పులతో కొట్టాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై టీడీపీ మంత్రులు, నేతల ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
శనివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు లేని భవనంగా అభివర్ణించిన మంత్రి గంటా... ఆ భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయం జగన్‌ను వెంటాడుతుందన్నారు.
వైసీపీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలు వరుస కట్టి పార్టీని వీడుతుండటంతో జగన్‌కు మతి భ్రమించిందన్నారు. ఈ కారణం చేతనే వైయస్ జగన్ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న జగన్ మానసిక పరిస్థితి బాగా లేదని కూడా గంటా వ్యాఖ్యానించారు.

జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి అయ్యన్న
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. లేదంటే జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. జగన్‌లో మార్పు కోసం వైసీపీ నేతలు ప్రయత్నం చేయాలని మంత్రి సూచించారు.
జగన్ ఓ ఉన్మాది: మంత్రి మృణాళిని
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఓ ఉన్మాది అని మరో మంత్రి మృణాళిని ఆరోపించారు. శనివారం ఆమె విజయనగరంలో మాట్లాడుతూ జగన్ దిగజారుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. నిరాశ నిస్పృహలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
ప్రతిపక్ష నేత హోదాను నిలబెట్టుకునేలా జగన్ వ్యవహారశైలి మార్చుకోవాలని హితవు పలికారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications