కేసీఆర్‌పై మంత్రి కామినేని ఫైర్, 'చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు'
అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతివ్యూహాం బాగానే పనిచేస్తున్నట్లు ఉంది. చంద్రబాబుకు అటు ప్రజలు, ఇటు మంత్రుల నుంచి పూర్తి స్ధాయిలో మద్దతు లభిస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు మంత్రి వర్గంలోని కొందరు మంత్రులు కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
రేపు జరగనున్న మంత్రి వర్గంలో తీసుకోనున్న తీర్మానాలకు తమ వంతు సహకారం ఉంటుందని మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుట్రపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఎన్నికల ముందు నుంచి టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నామని, ఇక మీదట ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే సీఎం కేసీఆర్, చంద్రబాబుపై నిందలు వేస్తున్నారని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ధ్వజమెత్తారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబు సంభాషణల ఆడియో టెపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చజరగాలని తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకటరావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications