రేషన్ లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కొత్తగా అందుబాటులోకి.. మీ ముందుకే..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ వ్యవస్థ లో పలు మార్పులు తీసుకొచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. రేషన్ దుకాణాల వద్దనే సరుకుల సరఫరా జరుగుతోంది. ఈ సమయంలోనే రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం తో పాటుగా మరిన్ని వస్తువుల పంపిణీ పైన తాజాగా ప్రభుత్వం ప్రకటన చేసింది. అదే విధంగా మినీ మార్టులు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేసారు. రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదని.. భవిష్యత్తులో చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యంతోపాటు పంచదార, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన మిల్లెట్స్, పామాయిల్, రాగి, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను రాయితీపై తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

బహిరంగ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని ఎన్‌సీసీఎఫ్‌తో భాగస్వామ్యం చేసుకుని, రాష్ట్రంలో హోల్‌సేల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లకు ధీటుగా 1,000 మినీ మార్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రం సంస్కరణల్లో భాగంగా రేషన్ లబ్ధిదారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చడానికి ఛండీఘఢ్, పుదుచ్చేరిల తరహాలో సీబీడీసీ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కొత్తగా మినీ మార్ట్ ల ఏర్పాటుకు కసరత్తు
కాగా, విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని అమలు చేసి.. తర్వాత రాష్ట్రమంతటా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సూపర్ ఫైన్ రైస్‌ను సరఫరా చేస్తున్నామని నాదెండ్ల తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్ రైస్‌ను తీసుకొచ్చేందుకు నిపుణులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఇప్పటికే క్యూఆర్ కోడ్ విధానాన్ని విజయవంతం అమలు చేస్తున్నందుకు కేంద్రం నుంచి ప్రశంసలు అందుకున్నామని తెలిపారు.
సీఎంఆర్ డెలివరీస్‌లో కూడా మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఈకేవైసీ ప్రక్రియను 99.06 శాతం పూర్తి చేసిన రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనని చెప్పారు. ఈ ఏడాది 17.97 లక్షల మంది రైతుల నుంచి 1.29 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. 94 శాతం మంది రైతులకు 24 గంటల్లోనే సొమ్ములు చెల్లించి రికార్డు సృష్టించామని మంత్రి తెలిపారు.













Click it and Unblock the Notifications