కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రకాశం జిల్లాలో చేదు అనుభవం
ఒంగోలు: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్‌కు ప్రకాశం జిల్లా పొందూరులో చేదు అనుభవం ఎదురయింది. నిర్మల కారును పొగాకు రైతులు అడ్డుకున్నారు. మిగిలిన పొగాకును కొనుగోలుకు హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పొగాకు రైతులను ఆమె పరామర్శిస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు తొలుత ఒంగోలులో పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు.

ధరలపై నిర్మల రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలంపై పలువురు రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె పొందూరులో పర్యటించారు.పొగాకు కొనుగోళ్లపై నిర్దిష్ట హామీ ఇవ్వకుండా వెళిపోతున్నారంటూ కారును అడ్డుకున్నారు.
మిగిలిన పొగాకు కొనుగోలుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అంతకుముందు పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలంటూ ఒంగోలు ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేశారు.
నష్టపోయిన రైతులకు భారీ స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పొగాకు సంక్షోభం ఉంటే పొగాకు బోర్డు ఛైర్మన్ ఇటలీ వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిర్మల ఆయనను రెండు రోజుల క్రితం విధుల నుంచి తప్పించారు.












Click it and Unblock the Notifications