జగన్ అన్న కట్టించిన ఇల్లు ఆనందాల పొదరిల్లు - మంత్రి రోజా
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా నిండ్ర మండలం లోని కొత్త ఆరూరు పంచాయతీకి చెందిన ఎస్ టి కాలనీలో జగనన్న హౌసింగ్ కాలనీ నిర్మాణం జరిగింది. ఇక ఈ హౌసింగ్ కాలనీలో నిర్మించిన ఇళ్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తో కలిసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా అన్న కట్టించిన ఇల్లు ఆనందాల పొదరిల్లు అంటూ జగన్మోహన్ రెడ్డి నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు అంటూ ఓ రేంజ్ లో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.
జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్ళు ప్రారంభించిన మంత్రి రోజా
జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్లను పండుగ వాతావరణంలో ప్రారంభించిన క్రమంలో మంత్రి రోజా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. నిండ్ర మండలం కొత్త ఆరూరు పంచాయతీలోని ఎస్.టి కాలనీలో రూ.46.80 లక్షల అంచనా వ్యయంతో 26 పక్కా గృహాలు నిర్మించడం జరిగిందని, ఈ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకమని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రంలో పేద వారి సొంత ఇంటి కల నెరవేరాలంటే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు.
ఎన్ని సమస్యలున్నా వెనక్కి పోని నాయకుడు వైఎస్ జగన్ : రోజా
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా పేదలకు సొంత ఇంటిని నిర్మించి ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా వెనక్కి పోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంత్రి రోజా. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 లక్షల ఇళ్ళు నిర్మించడం జరుగుతున్నదని తెలిపారు. సొంత ఇంట్లో గౌరవంగా జీవించాలన్నదే ప్రతి ఆడపడుచు కల అని, ఆ ఆడపడుచుల కలను ముఖ్యమంత్రి నేడు నిజం చేస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.
చిత్తశుద్ధితో పని చేస్తున్న లీడర్ జగన్ : రోజా
ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్నారని, సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముంగిటికే చేర్చే వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆమె కితాబిచ్చారు. పేదలకు అమ్మఒడి, పించను, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, వసతి దీవెన, పథకాలను ప్రవేశ పెట్టి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు మంత్రి రోజా. నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారని, కర్ణాటక, తమిళనాడులో ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా వైద్యం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో బాధ్యతగా పని చేస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సొంతింటి నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి రోజా తెలిపారు. పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అన్నారు.












Click it and Unblock the Notifications