రజినీకాంత్‌కు ఆ వీడియోలు పంపిస్తా- మంత్రి రోజా సెటైర్లు..!!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు విజయవాడలో ముగిశాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు రజినీకాంత్. చంద్రబాబు పరిపాలనపైనా ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు తనకు 30 సంవత్సరాలుగా మిత్రుడని, మోహన్ బాబు ద్వారా తనకు పరిచయం అయ్యాడని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఆయనకు ఉన్న విజన్ ఏమిటనేది ఇప్పటికే ప్రపంచం మొత్తం చూసిందని కితాబిచ్చారు. హైదరాబాద్‌ను న్యూయార్క్‌లాగా తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. ఈ శతజయంత్యుత్సవాలను చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతృప్తి చెందుతుంని, చంద్రబాబును ఆశీర్వదిస్తుందని చెప్పారు.

ఈ వ్యాఖ్యలను పర్యాటక శాఖ మంత్రి రోజా తప్పుపట్టారు. రజినీకాంత్‌పై ఎదురుదాడికి దిగారు. ఓ సూపర్ స్టార్‌గా ఆయన అంటే తనకు అభిమానమే అయినప్పటికీ- ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. చంద్రబాబు మోసగాడు, తడిగుడ్డతో గొంతుకోసే రకం అంటూ స్వయంగా ఎన్టీ రామారావే చెప్పారని గుర్తు చేశారు.
ఆ వీడియోలను రజినీకాంత్ చూసినట్టు లేదని, కావాలంటే వాటిని తాను ఆయనకు పంపిస్తానని అన్నారు. ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఓ ప్రముఖ దినపత్రికలో చంద్రబాబు దగ్గరుండి కార్టూన్లను వేయించారని, అలాంటి వ్యక్తిని ఆయన ఆత్మ ఎలా ఆశీర్వదిస్తుందని రోజా ప్రశ్నించారు. చంద్రబాబుపై రజినీకాంత్ పొగడ్తల వర్షాన్ని కురిపించడంలో అర్థమే లేదని వ్యాఖ్యానించారు.

తన స్వయంకృషితో తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఘన విజయాన్ని అందించిన ఎన్టీఆర్ ఎక్కడ.. ఆయన నుంచి పార్టీని, ఎన్నికల గుర్తును లాక్కుని, మానసిక క్షోభకు గురి చేసి, మరణానికి కారణమైన చంద్రబాబు ఎక్కడ.. ఇద్దరికీ నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ 2020 అంటూ రజినీకాంత్ గొప్పగా చెప్పారని, నిజానికి అదే 2020లో 23 సీట్లతో ఇంట్లో కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. ఇక 2047కు ఎక్కడుంటాడోనని చురకలు అంటించారు.
నిజానికి- ఎన్టీ రామారావు ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని రోజా అన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఢిల్లీలో చక్రాలు తిప్పుకొన్నట్లుగా చంద్రబాబు చెప్పుకొన్న రోజుల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డును ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. 2024లో తాము 175కు 175 నియోజకవర్గాలను కొట్టబోతోన్నామని, టీడీపీకి గెలిచే ఛాన్స్ లేదని అన్నారు.












Click it and Unblock the Notifications