అప్పట్లో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం - మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్యకుమార్ యాదవ్ విజయవాడలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రచయిత, అభ్యుదయవాది డాక్టర్ సమరం రచించిన 218వ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. డాక్టర్ సమరం కృషిని ప్రశంసిస్తూ, ఆయన జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
డాక్టర్ సమరం కృషికి మంత్రి ప్రశంసలు..
సాధారణంగా ప్రజలు 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారని, కానీ 86 ఏళ్ల వయసులో కూడా డాక్టర్ సమరం అలసిపోకుండా పనిచేస్తున్నారని మంత్రి కొనియాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా రిటైర్ కాలేదు, అలసిపోలేదు అని ఒక సందర్భంలో చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితమే ఆధునిక సమాజం చర్చించుకోవడానికి ఇబ్బంది పడుతున్న విషయాలను పుస్తకాల రూపంలో సమరం వెలువరించారని ప్రశంసించారు. సైన్స్ గురించి ఆయనకున్న విస్తారమైన జ్ఞానం అసాధారణమని చెప్పారు.

అంతే కాకుండా డాక్టర్ సమరం పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను మంత్రి వివరించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జన్మించడం వలన ఆయన తండ్రి, ప్రముఖ హేతువాది గోరా, అతనికి సమరం అని పేరు పెట్టారని తెలిపారు.
అంతే కాకుండా ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు "రప్పా రప్పా" వంటి వింత పేర్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కాకుండా, ఒక మంచి ఉద్దేశంతో పేర్లు పెట్టాలని హితవు పలికారు. డాక్టర్ సమరం, ఆయన సోదరుడు, సోదరి పేర్లను చూస్తేనే గోరా ఎంత అభ్యుదయవాదో అర్థమవుతుందని అన్నారు.
సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకత..
మంత్రి సత్యకుమార్ యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. తాను చిన్నప్పుడు స్వాతి వంటి పుస్తకాలను రహస్యంగా చదివేవాడినని, కానీ ఇప్పుడు తాను పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. దీనివల్ల యువతలో సరైన అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విజయవాడలో ప్రముఖ వైద్యులు డా.సమరం గారు రచించిన 218వ పుస్తకం ‘‘కాంప్రహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ” పుస్తకాన్ని ఆవిష్కరించాను. చాలామంది 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ డాక్టర్ సమరం గారు 86 ఏళ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోలేదు. ఆయన ఉత్సాహం అద్భుతం.
— Satya Kumar Yadav (@satyakumar_y) August 5, 2025
మాజీ ప్రధానమంత్రి… pic.twitter.com/RpzhL5FBqs
టెక్నాలజీ అభివృద్ధి..
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో టెక్నాలజీ అభివృద్ధి చాలా వేగంగా జరిగిందని, ఆరోగ్య రంగంలోనే 25 యూనికార్న్‌లు మన దేశంలో ఉన్నాయని మంత్రి అన్నారు. ఇది దేశం ఎంత వేగంగా పురోగమిస్తుందో చూపిస్తుందని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ బ్లడ్ సెల్స్..
బ్లడ్‌కు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న ఈ రోజుల్లో, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ బ్లడ్ సెల్స్ వస్తాయని డాక్టర్ సమరం అభిప్రాయపడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications