నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ చేసిన ఆరోపణలను మంత్రి సవిత ఖండించారు. తల్లికి వందనం పథకం నిధులు ఒక్కొక్కరి నుంచి రూ.2,000 చొప్పున లోకేష్ జేబులోకి వెళ్లినట్టు నిరూపిస్తే.. తానే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అది నిరూపించలేకపోతే, వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా? అని ప్రశ్నించారు.
మంత్రి సవిత ఇంకా మాట్లాడుతూ.. 2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం వర్తింపజేశారని అన్నారు. ఒక్కరుంటే రూ.13,000, ఇద్దరైతే రూ.26,000 ఇలా పెరిగేలా నగదు మంజూరు చేశారన్నారు.

కానీ 2019లో జగన్ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మోసం చేశారని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇంట్లో ఒకరికే ఇచ్చి పరిమితులు పెట్టారని మండిపడ్డారు. తల్లికి వందనం పథకం ద్వారా గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని వ్యాఖ్యానించారు.
అలానే విద్యార్ధులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో రూ.2,220 విలువైన విద్యా కిట్లు అందించామని తెలిపారు. మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామని, ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుతో భోజనం అందిస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీపై తొలిసంతకంతో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు మంత్రి. ప్రజలు ఏ నమ్మకంతో తమకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో అనేకమంది సలహాదారులు ఉన్నప్పటికి రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు.

ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ బుద్ది చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడ ఇవ్వలేదంటే ప్రజలకు జగన్ పై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమౌతోందో తెలుసుకోవాలన్నారు. అనవసరంగా నిందలు వేస్తే సహించేది లేదని.. ముక్కు నేలకేసి క్షమాపణ కోరాలని చెప్పారు.












Click it and Unblock the Notifications