నట్టేట ముంచారు: చంద్రబాబుపై మిథున్ రెడ్డి
చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు.
ఇప్పటికే చాలామంది రైతులు డిఫాల్టర్స్ అయ్యారని మిథున్ రెడ్డి చెప్పారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు.
తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని మిథున్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని మిథున్ రెడ్డి తెలిపారు.

జిల్లాల వారీగా వైయస్సార్ కాంగ్రెస్ సమీక్షలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఓ బృందం ఇందుకోసం జిల్లాల్లో పర్యటించనుంది. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, విజయ సాయిరెడ్డిలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అక్టోబర్ 25న కృష్ణా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న తిరుపతి, 30న వైయస్సార్ కడప, 31న అనంతపురం, నవంబర్ 1న కర్నూలు జిల్లాలో ఈ కమిటీ పర్యటించనుంది. నవంబర్ 5న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలతో చర్చిస్తామని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి తెలిపారు.
రుణమాఫీ, పెన్షన్లు, ప్రభుత్వ హామీలపై జిల్లా నేతలతో సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, జ్యోతుల నెహ్రూ పర్యటిస్తారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.












Click it and Unblock the Notifications