అసెంబ్లీలో బైఠాయింపు: అర్థరాత్రి ఎమ్మెల్యేల తరలింపు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తూ శాసనసభలో బైఠాయించిన వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులను, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులను మార్షల్స్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అక్కడి నుంచి తరలించారు. వాహనాల్లో వారిని తీసుకుని వెళ్లి వారి వారి పార్టీ కార్యాలయాల్లో వదిలేశారు. రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తీరును నిరసిస్తూ సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రంతా అసెంబ్లీలోనే భైఠాయించారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో సభ వాయిదా పడినప్పటికీ ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు మాత్రం బయటకు రాలేదు. ముసాయిదా బిల్లును అప్రజాస్వామిక విధానంలో సభలో ప్రేవశపెట్టారని, సభ అనుమతి లేకుండా దానిపై చర్చించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు.

బిల్లు విషయంలో సభా సంప్రదాయాల ప్రకారమే వ్యవహరించాలని, ఇందుకు శాసన సభ స్పీకర్ తమకు నిర్దిష్ట హామీ ఇవ్వాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తిరిగి మంగళవారం ఉదయం సభ ప్రారంభమయ్యే వరకు తాము సభా ప్రాంగణం నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని లోపలే ఉండిపోయారు.
మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా అక్కడే పూర్తి చేసి సభలోనే పడుకున్నారు. టీడీపీకి చెందిన 45 మంది, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వీరి ఆందోళన విరమింపచేయడానికి శాసనసభ కార్యదర్శి సదారాం, చీఫ్ మార్షల్ కరుణాకర్ అనేకసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications