మంత్రి పదవులు రావా?: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల అంతర్మథనం?
అమరావతి: మంత్రి పదవులు వస్తాయని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురుకానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆడిన మైండ్ గేమ్‌లో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలు పెట్టినట్లు పలువురు టీడీపీ నేతలు అంటున్నారు.
సీఎం చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికే వైసీపీ నేతలకు డబ్బు, మంత్రి పదవులను హామీలుగా ఇచ్చాడని అంటున్నారు. అయితే పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. పార్టీలోనే ఎప్పటి నుంచో కొనసాగుతున్న అనేక మంది సీనియర్లకు కూడా చంద్రబాబు ఇదే మాట ఇచ్చారని అంటున్నారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్ధానాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ ప్రకారం అన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం లేదు. రాష్ర్ట శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 15 శాతం అంటే సుమారు 26 మందికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో చంద్రబాబుతో కలసి 20 మంది మంత్రులున్నారు.
దీనిని బట్టి చూస్తే మరో ఆరుగురిని మాత్రమే కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో సోమిరెడ్డి, పయ్యావుల, ముద్దుకృష్ణమ, కళా వెంక ట్రావు, బుచ్చయ్యచౌదరి, ధూళిపాళ్ల, యరపతినేని, చింతమనేని, బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శివాజీ, దామచర్ల జనార్ధన్ తదితరులున్నారు.

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరిద్దర్ని మినహా ఎక్కువ మందిని తొలగించేందుకు అవకాశం కూడా లేదు. అలాంటిది వైసీపీలోకి చేరిన అందరికి మంత్రి పదవులు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీకి చెందిన భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం మీడియాలో జోరుగా జరుగుతోంది. మరోవైపు భూమా నాగిరెడ్డి మంత్రి పదవి ఇస్తే రాయలసీమ నుంచి తనకు అవకాశం దక్కదనే అనుమానంతో పయ్యావుల కేశవ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక నెల్లూరు చెందిన మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పట్టుకున్నారు. అయితే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరికి మంత్రిపదవులు వస్తాయో లేదో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. మరోవైపు చంద్రబాబు హామీ మేరకు టీడీపీలో చేరిన తమకు మంత్రి పదవి రాకపోతే తమ పరిస్థితి ఏంటని వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్మథనం పడుతున్నారు.
అయితే వారికి మంత్రి పదవులు రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు గతంలో చంద్రబాబు అవలంభించిన విధానాలనే కారణమంటున్నారు. గుంటూరు జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్, చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంటే నడిచారు.
గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు ఇవ్వని చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తొలివిడత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు కేటాయిస్తానని తన నివాసంలో భోజనం పెట్టి మరీ హామీ ఇచ్చారంట. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో పుష్పరాజ్ పేరు కనీసం పరిశీలనకు కూడా రాకపోవడం గమనార్హం. ఇక ప్రకాశం జిల్లాలో పార్టీ సీనియర్ నేత కరణం బలరాంకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు.












Click it and Unblock the Notifications