జగన్ దోస్తీతో లెక్క తేలింది: 'సీక్రెట్'లో ఎవరు చిత్తు, మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్?
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా ఏడుగురు పోటీ పడుతున్నారు.
తెరాస నుండి ఐదుగురు, కాంగ్రెస్, టీడీపీల నుండి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచారు. నాలుగు స్థానాలు కూడా గెలిచే బలం లేని తెరాస ఐదుగురు అభ్యర్థులను నిలబెట్టిందని కాంగ్రెస్, టీడీపీలు భగ్గుమంటున్నాయి. తెరాస అధికారంలో ఉన్నందున తమ పార్టీకి చెందిన వారిని ఆకర్షిస్తారని ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ కారణంగానే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతంలో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గోల్కొండ రిసార్టులో ఉంచారు. అధికార తెరాస తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయకుండా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆరు స్థానాలుకు ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతున్నప్పటికీ ఆ పార్టీ ఓ వైపు సేఫే అని చెప్పవచ్చు. అంతిమంగా తెరాస అభ్యర్థి లేదా టీడీపీ అభ్యర్థి మాత్రమే ఓడిపోతారనే వాదనలు వినిపిస్తున్నాయి.
వారి వారి వ్యూహాలను అనుసరించి లేదా ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తెరాస వైపు వెళ్లినందున ఆ నష్టం టీడీపీకి లేదా టీడీపీ నేతలు చెబుతున్నట్లు తెరాస సభ్యులు వారి అభ్యర్థికి ఓటు వేస్తే తెరాస నష్టపోతుందని చెప్పవచ్చు. అయితే, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు.

ఎవరి బలమెంత? టీడీపీ నుండి తెరాసలోకి చేరికలు
అందుకు పలు కారణాలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తెరాస పార్టీ తరఫున 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు బిఎస్పీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. అనంతరం టీడీపీ నుండి ఐదుగురు ఎమ్మెల్యేలు చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు, వైసీపీ నుంది ఇద్దరు చేరారు.
దీంతో తెరాస బలం 76కు చేరింది. తెరాసకు మజ్లిస్ పార్టీ మద్దతిస్తోంది. మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బలం 83కు చేరింది. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా తెరాసకు మద్దతిస్తున్నారు. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో తెరాస బలం 85కు చేరింది.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా చిక్కు కనిపించడం లేదు.
ఇక, టీడీపీ పదిహేను స్థానాల్లో, ఆ పార్టీకి మద్దతిస్తున్న బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది. కానీ, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 5గురు ఇప్పటికే కారు ఎక్కారు. దీంతో, టీడీపీకి ప్రస్తుతం పదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. బీజేపీ ఐదుగురితో కలిపితే.. పదిహేను అవుతుంది.
కేసీఆర్ పట్ల అసంతృప్తి!
మహానాడు ముగిసిన మరుసటి రోజే కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెరాసలో చేరారు. దీంతో, ముందు జాగ్రత్తపడిన టీడీపీ తమ ఎమ్మెల్యేలను రంగారెడ్డి జిల్లాలోని ఓ హోటల్లో ఉంచింది. టీడీపీతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
అయితే, తమ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని, దీంతో తెరాసలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయన పైన అసంతృప్తితో ఉన్నారని, వారు తమకే ఓటు వేస్తారని చెబుతున్నారు.
అందుకోసం రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి వంటి వారు పావులు కూడా కదుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ వ్యూహప్రతివ్యూహాల్లో ఎవరు చిత్తవుతారనేది రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం తేలనుంది. కాగా, కాంగ్రెస్, తెరాస, టీడీపీలు తమ తమ ఎమ్మెల్యేలకు రహస్య ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా సోమవారం ఉదయం అసెంబ్లీకి రానున్నారు.
తెరాసలోకి మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు?
ఇప్పటికే తెలంగాణ టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం శనివారం తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వచ్చారు. మరో ఇద్దరు తెరాసలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications