ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.

ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనావేసింది. పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వెల్లడించింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
నేడు- అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది.
నేడు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే- పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications