ప్రధానమంత్రి : పవన్ కళ్యాణ్, రజనీకాంత్ వల్లే నరేంద్ర మోడీ గెలిచారా?
విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి తారల వద్దతు వల్లే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారని ప్రముఖ తమిళ దర్శకులు అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి.
గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ - తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. పవన్ మద్దతు వల్ల ఏపీ, తెలంగాణలతో పాటు ఆయనకు అభిమాన గణం ఉన్న ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపాయని అంటున్నారు.
మరోవైపు, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నరేంద్ర మోడీ రజనీకాంత్‌ను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని లేదా బీజేపీకి మద్దతు పలుకుతారనే ప్రచారం జరిగింది. అయితే, కేవలం మిత్రుడిగానే కలిసినట్లు ఆ తర్వాత వెల్లడించారు. ఇది కూడా బీజేపీకి, మోడీకి లాభించిందని చెబుతున్నారు.

అయితే, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ హవా సాగింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తర ప్రదేశ్, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాలలో బీజేపీ పెద్ద మొత్తంలో లోకసభ స్థానాలు గెలుచుకుంది. అదే సమయంలో పవన్ మద్దతు పలికిన తెలంగాణలో బీజేపీ ఒక సీటునే గెలుచుకుంది. ఏపీలో టిడిపి - బిజెపి పొత్తు కలిసి వచ్చింది. దేశవ్యాప్తంగా మోడీ హవా కలిసి వచ్చిందని, అలాంటప్పుడు వీరిద్దరి వల్లే గెలిచారని చెప్పడంపై చర్చ సాగుతోంది.
ఇటీవల రూ.500, రూ.1000 నోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రజనీకాంత్ స్వాగతించారు. మోడీ ప్రకటన తర్వాత రజనీ సామాజిక అనుసంధాన వేదికపై స్పందిస్తూ.. నవ భారతం జన్మించిందని వ్యాఖ్యానించారు. మోడీ నిర్ణయాన్ని స్వాగతించడం డైరెక్టర్ అమీర్‌కు ఆగ్రహం తెప్పించింది.












Click it and Unblock the Notifications