
అస్పష్టంగా అసని తుఫాన్-ఇప్పటికే ఐదుసార్లు దిశ మార్పు-నర్సాపురం లేదా కాకినాడ తీరాన్ని తాకి..
అసని తుఫాన్ ఏపీ, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తుపాన్ కారణంగా ఇరు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో కల్లోలం రేగుతోంది. అయితే తుఫాన్ స్పందిస్తున్న తీరు కూడా వాతావరణ నిపుణుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే పలుమార్లు దిశ మార్చుకున్న ఈ తుపాను బలహీనపడుతుందా లేక తీరం దాటుతుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే తుపాను రేపటి కల్లా వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ విభాగాలు చెప్తున్నాయి.

అస్పష్టంగా అసని తుపాన్
గతంలో ఆంధ్రా తీరంలో ఏర్పడిన పలు తుపాన్ ల కదలికలు చాలా స్పష్టంగా ఉండేవి. తుఫాన్ గా రూపాంతరం చెందడం నుంచి మొదలుకుని ఎప్పుడు ఏ దిశగా పయనిస్తోంది. ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంటుందన్న దానిపై స్పష్టమైన మ్యాప్ లు ఉండేవి. వాతావరణ నిపుణులు కూడా ఆ మేరకు అంచనా వేసే వారు. కానీ ఈసారి అసని తుపాన్ మాత్రం కొంత అస్పష్టంగా పయనిస్తోంది. దీంతో కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో లేక బలహీనపడుతుందో తెలియక గందరగోళం నెలకొంది.

ఐదుసార్లు దిశ మార్పు
అసని తుపాన్ ప్రభావం మొదలైన తర్వాత ఇప్పటివరకూ ఐదుసార్లు తుఫాన్ దిశ మారింది. మొదట్లో ఒడిశా తీరంలోనే ఇది పయనిస్తుందని భావించినప్పటికీ ఆ తర్వాత ఉత్తరాంధ్రకు చేరి అక్కడి నుంచి తిరిగి గోదావరి జిల్లాల మీదుగా కృష్ణా జిల్లా వరకూ విస్తరించి ఇప్పుడు మచిలీపట్నానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. అక్కడి నుంచి గంటకు కేవలం 6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఇది తిరిగి గోదావరి జిల్లాలవైపు పయనిస్తోంది. అక్కడ కూడా నిలకడగా ఉంటుందా లేదా అన్నది పూర్తిగా తెలియడం లేదు.

నర్సాపురం లేదా కాకినాడ తీరాన్ని తాకి..
ప్రస్తుతం అసని తుపాను పయనిస్తున్న దిశ, వేగం బట్టి చూస్తే అది మచిలీపట్నం నుంచి భీమవరం జిల్లాలోని నరసాపురం లేదా కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ విభాగాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు తీరాల్లో రేపటి కల్లా ఏదో ఒక దాన్ని తాకి అసని తుపాన్ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు వాయుగుండంగా, అల్పపీడనంగా మారి సముద్రంలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు లేకుండా ఊపిరి పీల్చుకోవచ్చు.