సంక్రాంతికి నర్సాపురంలో రఘురామకృష్ణరాజు?
సంక్రాంతి పర్వదినం ఉభయ గోదావరి జిల్లాల్లో నభూతో.. అన్నరీతిలో జరుపుతారు. ముఖ్యంగా కోడిపందాలకు రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఆ సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం పట్టించుకోరు. అటువంటి గోదావరి జిల్లా నుంచి ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు మరోసారి సంక్రాంతి పర్వదినాన్ని తన సొంత నియోజకవర్గంలో జరుపుకోవాలని యోచిస్తున్నారు.
కానీ అది జరిగే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ప్రధానమంత్రి పర్యటనకు హాజరయ్యేందుకు లింగంపల్లిలో రైలు ఎక్కిన రఘురామ బేగంపేటలో దిగిపోయారు. పర్యటనకు వెళ్లలేదు. సత్తెనపల్లి దగ్గర తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంపీ రఘురామ నర్సాపురం వెళ్లిన మరుక్షణం అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసు బలగాలు సిద్ధంగా ఉంటాయి. గతంలో మూడుసార్లు నియోజకవర్గానికి వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన వెళ్లలేకపోయారు. అరెస్ట్ చేసిన సమయంలోను హైదరాబాద్ నుంచే తీసుకువెళ్లారు.

నర్సాపురం వెళ్లాలనే పట్టుదలతో ఉన్న రఘురామ తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఇప్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో డీజీపీని కోరినా ఇవ్వలేదని, తన నియోజకవర్గానికి వెళ్లిన వెంటనే ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఈ అంశాన్ని ప్రస్తావించగానే జస్టిస్ రఘునందన్ రావు విచారణ నుంచి తప్పుకోవడంతో మరో బెంచ్ పై విచారణ జరగబోతోంది. ఏదేమైనప్పటికీ 2023 సంక్రాంతి కూడా రఘురామ హైదరాబాద్ లోకానీ, ఢిల్లీలోకానీ జరుపుకోవడమేనని, సొంత నియోజకవర్గంలో జరుపుకునే దాఖలాలు కనపడటంలేదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications