మూఢం: ముహూర్తాల్లేవ్, జగన్ హ్యాపీ... ఎమ్మెల్యేల వలసలకు బ్రేక్?
అమరావతి: రాజకీయ నాయకులు జ్యోతిష్యుల సూచనలను తప్పక పాటిస్తారన్న విషయం మనకు తెలిసిందే. సినిమా వాళ్ల మాదిరిగానే రాజకీయ నాయకులు కూడా పదవులను స్వీకరించేటప్పుడు ముహూర్తాలు, జ్యోతిష్యానికి సంబంధించి విశ్వాసాలు ఎక్కువగా పాటిస్తుంటారు.
తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు మంచి ముహుర్తాలను సైతం చూసుకుంటున్నారని సమాచారం. తమ తమ పేరు బలాలకు సంబంధించి మంచి మంచి జ్యోతిష పండితులతో సుముహూర్తాలు పెట్టించుకుని సీఎం చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కేస్తున్నారు.
పోయిన నెలలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఉదయం ముహుర్తమే మంచిదని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఉదయాన్నే కండువా కప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇదంతా వైసీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించినది.

ఇప్పటి వరకు టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' లో భాగంగా వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మరో 14 మంది టీడీపీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఆయన మాటలు ఒట్టిమాటలే అని తేలాయి. ఎందుకని ఆరాతీస్తే మూఢం వచ్చేసింది ముహూర్తాలు లేవు అనే మాటలే వినిపిస్తున్నాయి. వైసీపీ టికెట్‌పై గెలిచి ఇన్ని రోజులు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వారంతా టీడీపీలో చేరాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని జ్యోతిష్యులు అంటున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము టీడీపీలోకి చేరుతున్నామని చెబుతున్నా ఎమ్మెల్యేలు కొందరైతే, మంత్రి పదవిని ఆశించి టీడీపీలో చేరే వారు కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో చేరేవారు అందుకు ఖచ్చితంగా మంచి ముహూర్తాలే ఎంచుకుంటారనడంలో సందేహం లేదు.
ఇప్పటి వరకు టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను పరిశీలిస్తే... మంచి ముహూర్తాలను లెక్కవేసుకునే.. టీడీపీలో చేరారనే అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం మూఢం వచ్చేయడంతో వలసలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరికొంత మంది తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబుతో మాటామంతీ పూర్తిచేసుకున్న నాయకులు కూడా ఉన్నారని అయితే ముహూర్తాలు కుదరక వారు చేరిక తేదీలను వాయిదా వేసుకున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మూఢం పూర్తైన వెంటనే వైసీపీకి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడం ఖాయం అంటున్నారు.












Click it and Unblock the Notifications