ముంబై నటి జెత్వానీ వేధింపుల వ్యవహారం.. వారిపై సజ్జల పరువునష్టం దావా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు, రాజకీయ నేతల వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరీ జెత్వానీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. ఇవాళ విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన జెత్వానీ సీపీతో తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఆధారాలతో సహా పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు సమాచారం.
పరువునష్టం దావా వేసిన సజ్జల
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించిన సజ్జల రామకృష్ణా రెడ్డి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఆయన ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం' పేరుతో కథనం ప్రచురించి, దుష్ప్రచారం చేసిన ఈనాడుతో పాటు, ఆ కథనం ఆధారంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యపై పరువు నష్టం దావా వేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ నోటీస్‌లు
వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు వారికి లీగల్ నోటీస్‌లు పంపించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుండి కక్షసాధింపు చర్యలను చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. తనను అప్రదిష్ట పాలు చెయ్యటమే లక్ష్యంగా టీడీపీ ఆ నటిని రంగంలోకి దింపిందని ఆరోపించారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న సజ్జల
కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేలా హత్యలు, ఆస్తుల విధ్వంసాలు, దౌర్జన్యాలు, దాడులతో పాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఇటీవల ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
వారికి లీగల్ నోటీసులు
ముంబయి నటికి వేధింపులు సజ్జల సహాయం అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి నాయకులు, టిడిపి సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి దిగుతోందని, ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కథనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నేడు లీగల్ నోటీసులు పంపారు సజ్జల రామకృష్ణా రెడ్డి.












Click it and Unblock the Notifications