నటన తప్ప: పవన్‌పై మైసూరా, టిడిపి 'విన్' సర్వేపై ఫైర్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి బుధవారం మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించడం తప్పితే ఏ రోజైనా సమాజ సేవ చేసిన సందర్భం ఉందా అని మైసూరా ప్రశ్నించారు.
పవన్ చెప్పిన మాటలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కొందరి ప్రోత్సాహంతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలం బాగా ఉందని చెప్పిన సిఎన్ఎన్ ఐబిఎన్ సర్వే తప్పుల తడక అన్నారు.

టిడిపికి నిజంగానే అంత బలముంటే ఇతర పార్టీలతో పొత్తుకు ఆరాటం ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేలతో ప్రజలను సిఎన్ఎన్ ఐబిఎన్ ఏప్రిల్ ఫూల్ చేసిందని ఎద్దేవా చేసారు. ప్రజల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నాలు చేయడం విడ్డూరమన్నారు. ఇంత దగా సర్వేను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు.
ఇది కుట్రపూరిత సర్వే అన్నారు. అంకెల గారడి తప్ప ఎక్కడా వాస్తవాలు లేవన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు అభద్రతా భావంలో, అసహనంతో ఉన్నారన్నారు. ఈనాడు, సిఎన్ఎన్ ఐబిఎన్‌లలో పెట్టుబడిదారులు ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. టిడిపికి లేని బలం చూపారని విమర్శించారు.
సర్వేలతో ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారన్నారు. పవన్ మాటలను పట్టించుకోమన్నారు. నీల్సన్ ఓఆర్జీ మార్గ్ 50వేల శాంపిల్స్‌తో సర్వే చేయిస్తే, సిఎన్ఎన్ ఐబిఎన్ 1300 మందితో సర్వే చేసిందన్నారు. పలు పార్టీల నేతలకు తెలుగుదేశం పార్టీ పునరావాస కేంద్రంగా మారిందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications