తిరుమల శ్రీవారికి భారీ కానుక ఇచ్చిన మైసూరు రాజమాత..
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి భారీ కనుకను అందించారు. రెండు భారీ వెండి అఖండ దీపాలను (నిరంతరంగా వెలిగే దీపాలు) విరాళంగా సమర్పించారు. రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఒక్కో అఖండ దీపం బరువు సుమారు 50 కిలోలు ఉంటుందని చెబుతున్నారు. కార్యక్రమం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రాజమాతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా సత్కరించారు. అలానే బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. రాజమాతపై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా సుమారు 300 సంవత్సరాల క్రితం, అప్పటి మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి ఇలాంటి అఖండ దీపాలను సమర్పించినట్లు చరిత్ర ఆధారాలు పేర్కొంటున్నాయి.

మళ్లీ ఇప్పుడు చాలా దశాబ్దాల తరువాత మళ్లీ అదే వంశానికి చెందిన రాజమాత ప్రమోదాదేవి ఈ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించడం హర్షణీయమని అంటున్నారు. ఈ అఖండ దీపాలు శ్రీవారి గర్భగుడిలో నిత్యంగా వెలిగించే సంప్రదాయ దీపాలు. దీక్షతో, శుద్ధితో వెలిగించే ఈ దీపాలు ఆలయంలో ఆధ్యాత్మిక శోభను పెంచుతాయి. అంతే కాకుండా ఆలయంలో అఖండ జ్యోతి ఓ శాశ్వత దీపంగా, శాంతి, భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా ఉంటుంది. టీటీడీ ఆహార్యంగా పాలించబడుతున్న కాలంలోనూ, రాజులు, సామంతులు విరాళాల ద్వారా తమ భక్తిని చాటుకున్నారని అంటున్నారు.
మరోవైపు కొద్దిరోజుల క్రితమే అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీ విరాళాలు అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. ఆనంద్ మోహన్ రూ.1,40,05,696 విలువైన విరాళాలను పలు ట్రస్టులకు పంపిణీ చేశారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ - రూ.1,00,01,116.. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ - రూ.10,01,116.. ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ - రూ.10,01,116.. ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ - రూ.10,01,116.. ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ - రూ.10,01,116. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన సేవా మనోభావాన్ని కొనియాడారు.












Click it and Unblock the Notifications