టీడీపీ ప్రభుత్వం తొలి సీఐడీ విచారణ - టార్గెట్ ఫిక్స్..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో నిర్ణయాలను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం నిత్యావసరాల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా జనసేన ముఖ్య నేత...మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస సమీక్షలు..ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో చోటు చేసుకున్న అక్రమాల వెనుక మాఫియా ఉందని చెబుతున్నారు. దీని పైన సీఐడీ విచారణ చేపడతామని ప్రకటించారు.
ఏపీలో రేషన్ షాపుల నుండి లబ్ధిదారులకు, పేదలకు అందాల్సిన సరుకులు పక్కదారి పట్టాయని, ప్రభుత్వం నుండి అందాల్సిన మొత్తం పేదలకు అందలేదని కూటమి సర్కారు అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ అంశం పై సీరియస్ గా ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మాఫియా ఉందని అనుమానిస్తున్నారు. ఇందులో సూత్రధారులు.. పాత్ర ధారులను గుర్తించేందుకు ఈ మొత్తం వ్యవహారం పైన సీఐడీ విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు.

కాకినాడ పోర్టు ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ పెద్ద ఎత్తున పక్కదారి పట్టిందని, కోట్లాది రూపాయల స్కాం అని మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుండి విదేశాలకు సరుకులు ఎవరి సహయంతో వెళ్లాయి, రేషన్ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు, అక్రమ బియ్యం దందాలో ఉన్న గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎవరో మొత్తం తేలుస్తామని ప్రకటించారు. ఇక నుండి రేషన్ షాపుల్లో పట్టిక ఉంటుందని... ఏయే రకాల సరుకులు ప్రభుత్వం అందిస్తుంది, ఒక కుటుంబానికి ఎంత మొత్తం ఇస్తుంది, ఎంత ధరకు ఇస్తుందో పారదర్శకంగా డిస్ ప్లే బోర్డుల ద్వారా వెల్లడిస్తామని మంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications