రాజకీయాల్లో దొంగలు పడ్డారు; పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. సభలో నాగబాబు సంచలనం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని భారీ సభను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ పార్టీ శ్రేణులకు భవిష్యత్తు రాజకీయాలను గురించి దిశానిర్దేశం చేయనుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదికగా సంచలన ప్రకటన చేయనున్నారని పార్టీ శ్రేణులలోను, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

రాజకీయాలలో దొంగలు ప్రజల అభివృద్ధిని, ప్రజల శ్రమను దోచుకుంటున్నారు: నాగబాబు
ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు హాజరైన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మెగా బ్రదర్ నాగబాబు సభా వేదికగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో దొంగలు పడ్డారు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సాధారణ దొంగలు ప్రజల ఆస్తులను దోచుకుంటుంటే, రాజకీయాల్లో పడిన దొంగలు ప్రజల అభివృద్ధిని, ప్రజల శ్రమను దోచుకుంటున్నారని నాగబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అప్పులు, కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని నాగబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి పౌరుని మీద లక్ష రూపాయల అప్పు ఉంది అని నాగబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని, రాజధాని లేకుండా పరిపాలన సాగించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు శాఖలు కూడా గుర్తు రావడం లేదని, చేయడానికి పని లేక సరదా సంభాషణలతో మంత్రులు కాలం వెళ్లదీస్తున్నారు అని నాగబాబు విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని మండిపడిన నాగబాబు జగన్ మోహన్ రెడ్డి పాలన లో అభివృద్ధి లేదని అడుగడుగునా విధ్వంసమే ఉందని పేర్కొన్నారు.

అద్భుత పాలన కావాలంటే సీఎంగా పవన్ కళ్యాణ్
అంతేకాదు తలబడాలంటే, నిలబడాలంటే వెన్నెముక కావాలని, ప్రజల నాయకుడుగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు అద్భుత పాలన అందించడం కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని నాగబాబు సభా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు.

జనసేన సభకు పోటెత్తిన కార్యకర్తలు, ప్రజలు .. భారీ ఏర్పాట్లు
ఇదిలా ఉంటే జనసేన ఆవిర్భావ సభకు భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. హాజరైన కార్యకర్తల కోసం, ప్రజల కోసం భారీ ఏర్పాట్లు చేసిన జనసేన పార్టీ నేతలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు భోజనానికి, మంచినీటికి ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. రెండు టన్నుల పులిహోర, మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లను, నాలుగు లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇక మహిళల కోసం 10,000 సీట్లను కేటాయించి సభకు వచ్చిన మహిళలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభపై భారీ అంచనాలతో, భారీ స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు సభా ప్రాంగణానికి తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications