నారావారిపల్లికి నందమూరి ఫ్యామిలీ- అందరి చూపులూ వారసుడిపైనే
చిత్తూరు: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవ్వాళ్టి నుంచే పాఠశాలలకు సెలవులు ఆరంభం అయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు సెలవులే. సంక్రాంతి పండగను తమ సొంతూరిలో జరుపుకోవడానికి బయలుదేరి వెళ్లే వారితో బస్సులు, రైళ్లు ఫుల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ సగం ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో ప్రయాణికులు బస్సులు, రైళ్ల ద్వారా సొంతూర్లకు తరలి వెళ్తోన్నారు.

ఇప్పటికే చంద్రబాబు..
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి కుటుంబం ఇప్పటికే నారావారిపల్లికి చేరుకుంది. గురువారం సాయంత్రం ఆయన కుటుంబం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన నాయకులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. చంద్రబాబు, నారా లోకేష్, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు ఎయిర్ పోర్టుకు వచ్చారు.

ఇప్పుడు నందమూరి కుటుంబం..
కాగా- ఇవ్వాళ నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా నారావారిపల్లికి చేరుకుంది. బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ- ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. శాలువ కప్పి ఆహ్వానించారు. టీడీపీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తెలుగు యువత నాయకులు రూపేంద్ర వర్మ తదితరులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

కనుమ వరకూ..
అనంతరం బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో నారావారిపల్లికి చేరుకున్నారు. తన బావ చంద్రబాబు, సోదరి భువనేశ్వరి, అల్లుడు నారా లోకేష్, కూతురు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. భోగి, సంక్రాంతి, కనుమ వరకూ నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లిలోనే ఉంటాయి. కనుమ పండగను ముగించుకున్న తరువాత అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తాయి.

జై బాలయ్య..
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ కేరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా విడుదలైన మరుసటి రోజే బాలకృష్ణ నారావారిపల్లికి చేరుకోవడంతో ఆయన అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. విమానాశ్రయం మొదలుకుని నారావారిపల్లికి చేరుకునేంత వరకూ ఆయనకు జేజేలు పలికారు. జై బాలయ్య... జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

అందరి చూపులూ మోక్షజ్ఞపైనే..
నందమూరి ఫ్యామిలీలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఇంకా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వలేదీ నందమూరి కుర్రాడు. మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురు చూస్తోన్నారు. ఈ సంవత్సరం ఆ కొరత తీరుతుందనే అంచనాలు ఉన్నాయి. మోక్షజ్ఞను చూడటానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎగబడ్డారు.

తొలి రోజే రూ.54 కోట్లు..
వీరసింహా రెడ్డి మూవీ తొలి రోజే రికార్డు కలెక్షన్లను రాబట్టుకుంది. 54 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను పోస్ట్ చేసింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. బాలయ్య డ్యుయెల్ రోల్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్.












Click it and Unblock the Notifications