చంద్రబాబు బాటలో నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి బస్సుయాత్ర!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లోకి వచ్చిన నారా భువనేశ్వరి, చంద్రబాబు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా నిజం గెలవాలి అంటూ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భువనేశ్వరి ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
రేపటినుండి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు సొంత జిల్లా నుండే భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రేపు చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు .చంద్రబాబు అరెస్టు వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఈ బస్సు యాత్ర ద్వారా నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.

ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో భువనేశ్వరి అక్కడి వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల లో నిర్వహించే బహిరంగ సభలో నారా భువనేశ్వరి చంద్రబాబు అక్రమ అరెస్టుపై మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలో నిర్వహించే కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఉద్దేశించే నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసుల నేపథ్యంలో వారిని పరామర్శించనున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగ సభలోనూ ఆమె ప్రసంగించనున్నారు. చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ ను ఫాలో అవుతూ భువనేశ్వరి చంద్రబాబు సొంత జిల్లా నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బస్సు యాత్ర ద్వారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి, చంద్రబాబు కోసం ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేయనున్నారు.
మరి భువనేశ్వరి బస్సు యాత్ర సక్సెస్ అవుతుందా? చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల్లో ఉద్యమం తీసుకురావాలని, టీడీపీ శ్రేణులకు అత్మస్తైర్యం ఇవ్వాలని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications