మంగళగిరిలో మారుతున్న పొలిటికల్ సీన్ -గేరు మార్చిన లోకేష్- ఆర్కేపై ముప్పేట దాడి
2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. తొలిసారి ఇక్కడి నుంచి అదృష్టం పరీక్షించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ కు చేదు ఫలితం తప్పలేదు. అయితే నిరాశపడకుండా అక్కడే ఉండి సర్వశక్తులొడ్డుతున్న లోకేష్ కు నియోజకవర్గంలో మారిన పరిస్ధితులు పూర్తిగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వాటికి సహకరిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే తీరు లోకేష్ కు వరంగా మారుతున్నాయి.
Recommended Video

మంగళగిరిలో మారిన సీన్
మంగళగిరిలో వరుసగా రెండోసారి పోటీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే చేతిలో దాదాపు 5వేల ఓట్ల తేడాతో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అప్పట్లో హోరాహోరీగా సాగిన పోరులో ఆర్కే ఆధిక్యం సాధించారు. అయితే ఆ తర్వాత ఆరునెలలకే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఎమ్మెల్యే ఆర్కేకు చుక్కలు కనిపించడం మొదలైంది. ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా మారిపోతున్నాయి. మంగళగిరిలో మారుతున్న పరిస్ధితుల్ని సొమ్ము చేసుకునేందుకు లోకేష్ కూడా అంతే వేగంగా పావులు కదుపుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి మరింత హోరాహోరీ తప్పేలా లేదు.

ఆర్కేకు రాజధాని కష్టాలు
గతంలో అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తున్న టీడీపీని కాదని మంగళగిరిలో ఆర్కేకు అక్కడి జనం ఓటేశారు. కానీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అమరావతి నుంచి రాజధాని తరలింపుకు రోడ్ మ్యాప్ సిద్ధమైపోయింది. దీంతో ప్రభుత్వానికి ఎదురుచెప్పలేక, మరోవైపు ఇవాళ కాకపోతే రేపైనా మంత్రి పదవి రాకపోదన్న ధీమాతో మౌనంగా ఉంటున్న ఆర్కేకు చుక్కలు కనిపిస్తున్నాయి. అమరావతి నుంచి రాజధాని తరలిపోతుంటే స్ధానిక ఎమ్మెల్యే అయి ఉండి పల్లెత్తు మాట అనని ఆర్కేపై స్ధానికంగా జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలిపోకుండా ఎలాంటి ప్రయత్నం కూడా చేయని ఆర్కేపై జనాగ్రహం నానాటికీ పెరుగుతోంది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరింత
అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఆపాల్సిన పరిస్ధితుల్లో ఆ పని చేయకుండా మిన్నకుంటున్న ఎమ్మెల్యే ఆర్కే.. అమరావతి రైతుల్ని, ఉద్యమాన్ని చులకన చేస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మరింత ఆగ్రహం తెప్పించాయి. అన్నింటికీ మించి రాజధాని కష్టాలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారన్న అపప్రదను ఆర్కే మూటగట్టుకున్నారు. దీంతో ఆర్కే పేరు చెబితేనే ఇప్పుడు మంగళగిరి జనం మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

గేరు మార్చిన లోకేష్
గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఆర్కే చేతిలో ఓటమిపాలైన నారా లోకేష్.. తాజాగా అక్కడ మారుతున్న పరిస్ధితుల్ని సొమ్ము చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంపీటీసీ ఎన్నికల్లో మంగళగిరి పరిధిలోకి వచ్చే దుగ్గిరాలతో పాటు పలు స్ధానాల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పలేదు. చివరికి అధికారుల అండతో వైసీపీ తాత్కాలికంగా గట్టెక్కింది. దీంతో ఆర్కేపై మరింత ఒత్తిడి పెంచేందుకు లోకేష్ మంగళగిరిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. స్ధానిక నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ఆర్కేపై విమర్శలు సంధిస్తున్నారు. మంగళగిరిలో రోడ్లు సహా స్ధానిక అంశాలన్నింటిపైనా టీడీపీ నిత్యం విమర్శలు చేస్తోంది. ఇవన్నీ ఆర్కేకు మైనస్ గా మారిపోతున్నాయి.

పొగొట్టుకున్న చోటే వెతుక్కుంటున్న లోకేష్
గతంలో ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఓటమి పాలైన లోకేష్. అప్పటి నుంచి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి ఉద్యమం కూడా కలిసి రావడంతో తరచుగా ఇక్కడ పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వారిలో స్ధైర్యం నింపుతున్నారు. ఫైనల్ గా గతంలో తాను పోగొట్టుకున్న మంగళగిరిలోనే తిరిగి గెలుపును వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే ఆర్కేపై పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు మూడు రాజధానులపై జగన్ సర్కార్ దూకుడు తనకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కలిసొస్తుందని లోకేష్ ధీమాగా కనిపిస్తున్నారు.