ఇక ఏటా డీఎస్సీ- తల్లికి వందనం, ఫీజుల చెల్లింపుపై లోకేష్ కీలక ప్రకటన..!
ఏపీలో ఇప్పటికే డీఎస్సీ రాసి సెలెక్ట్ కాలేకపోతున్న వారికి, భవిష్యత్తులో టీచర్లు కావాలనుకునే వారికీ విద్యామంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతిఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యాశాఖపై ఇవాళ రాష్ట్రస్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం తెలిపారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని, ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశాం, సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే అన్నారు.
మరోవైపు తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశామని లోకేష్ తెలిపారు. చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.325కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు.

తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయాలని అధికారుల్ని లోకేష్ ఆదేశించారు. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ , స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలన్నారు. ఇందుకోసం శాప్ సహకారం తీసుకోవాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం నాడు అసెంబ్లీ లో విద్యార్థులచే ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి స్పీకర్ అనుమతితో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విద్యార్థులను ఎంపిక చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందని లోకేష్ తెలిపారు. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వస్థానంలో ఉందని, ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నామన్నారు. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు.












Click it and Unblock the Notifications