అప్పుట్లో భూకంపం-తర్వాత శ్మశానం-ఇప్పుడు ఎకరం 10 కోట్లకా ? అమరావతిపై లోకేష్
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిగా ఎంపిక చేసిన అమరావతికి మొదట్లో అసెంబ్లీ వేదికగా మద్దతు పలికిన విపక్ష నేత వైఎస్ జగన్.. తాను సీఎం అయ్యాక మాత్రం మాట మార్చారు. మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. ఈ లోపు అమరావతిపై వైసీపీ నేతలు, మంత్రులు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కానీ తాజాగా అమరావతిలో భూముల్ని అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై టీడీపీ విమర్శలకు దిగుతోంది.
అమరావతి రాజధానికి భూకంపం ప్రమాదం ఉందని, ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అధికారంలోకి వచ్చాక నానా విమర్శలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎకరం 10 కోట్లకు ఎలా అమ్ముతారంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. "విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి భూకంప ప్రమాదం, ముంపు ముప్పు అని ప్రచారం చేశారు. ప్రభుత్వంలోకొచ్చాక శ్మశానం అన్నారు. నేడు ఎకరం 10 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అమ్మ లాంటి అమరావతిపై జగన్ మోసపు రెడ్డి కుట్రలకు అంతం లేదు" అంటూ లోకేష్ విమర్శించారు.

అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూముల్ని ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో ఇప్పటికే అక్కడ భూముల్ని రాజధాని కోసం ఇచ్చిన రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అమరావతిలో భూముల్ని ఇలా విడిగా అమ్ముకుంటుూ పోతే రాజధాని పరిస్ధితి ఏంటని, మిగిలిన తమ భూముల విలువ పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పు అమలు చేసే ప్రక్రియలో భాగంగానే తాము భూముల్ని అమ్ముతున్నట్లు సమర్ధించుకుంటోంది.