పోలవరం ముంపు గ్రామాల్లో నారా లోకేష్ పర్యటన , జగన్ ఇచ్చిన హామీలే ప్రధాన డిమాండ్లుగా టీడీపీ వార్ !!
ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చని తీరుపై సమర శంఖం పూరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్న క్రమంలో, తాజాగా పోలవరం ముంపు నిర్వాసితుల కోసం మరో పోరాటాన్ని ప్రారంభించారు నారా లోకేష్.
నేడు రేపు లోకేష్ పోలవరం ముంపు గ్రామాల పర్యటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు, రేపు నారా లోకేష్ పర్యటన పోలవరం ముంపు ప్రాంతాలలో కొనసాగనుంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు విని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నారా లోకేష్ ప్రయత్నం చేయనున్నారు. ఈరోజు భద్రాచలం, టేకుల బోరు, శ్రీరామగిరి, చింతూరులలో నారా లోకేష్ పర్యటన సాగనుంది. ఇక రేపు దేవీపట్నం, రంపచోడవరం, పెద్ద వేంపల్లి, ఇందుకూరు, కృష్ణుని పాలెం, ముసిరి గుంట ప్రాంతాలలో లోకేష్ పర్యటన కొనసాగనుంది.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న లోకేష్.. కరోనా తగ్గాలని, పోలవరం కోసం మొక్కులు
ఈరోజు పోలవరం పర్యటనలో భాగంగా ఉదయం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కష్టాలు కడతేరాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వుండాలని, తెలుగురాష్ట్రాలు సఖ్యతతో ఉండి పరస్పర ప్రయోజనాలు గౌరవించుకుని, ప్రగతిపథంలో సాగాలని ప్రార్ధించానని లోకేష్ వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భద్రాద్రి రామయ్యకు మొక్కుకున్నానని లోకేష్ వెల్లడించారు.
పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న లోకేష్ .. ప్రభుత్వంపై ఒత్తిడికి ప్లాన్
స్వామివారి దర్శనానంతరం పోలవరం ముంపు నిర్వాసితుల పరామర్శ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం టేకుల బోరు గ్రామంలో లోకేష్ పర్యటన సాగుతుంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలపై ఫోకస్ చేస్తున్న లోకేష్ ఆ హామీలు నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నారు. జగన్ ఇచ్చిన హామీలనే ప్రధాన డిమాండ్లుగా జగన్ సర్కార్ ముందు ఉంచుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ పోలవరం నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చారని పేర్కొంటున్న టిడిపి జగన్ ప్రతి ఎకరానికి 19 లక్షల రూపాయలు ఇస్తానని నాడు చెప్పారని, గతంలో ఎకరానికి 1.15 లక్షల పరిహారం ఇచ్చిన భూములకు ఐదు లక్షలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను టార్గెట్ చేసి జగన్ ను ఇరకాటంలో పెట్టే యత్నం
భూమిలేని వారికి పది లక్షలు ఇస్తానని, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ పరిహారం ప్యాకేజీ ఇస్తానని వెల్లడించారని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతుంది టీడీపీ . బ్రతుకుతెరువు కోసం బయట ఊళ్ళకి వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని, 39 రకాల సౌకర్యాలతో నిర్వాసితులు అందరికీ అన్ని వసతులతో కాలనీలను నిర్మిస్తామని వెల్లడించారని పేర్కొన్నారు. అంతేకాదు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని, భూమికి భూమి, పోడు భూమికి పట్టా ఇస్తామని నాడు జగన్ వెల్లడించారని చెప్తున్నారు.

ఒక్క హామీ అయినా నెరవేర్చారా జగన్ .. నిర్వాసితులకు 19 లక్షలు ఎప్పుడిస్తారు ? లోకేష్ ప్రశ్న
సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు పోలవరం నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చి చివరకు వారికి ఏది ఇవ్వకుండా మోసం చేశారంటూ, పోలవరం నిర్వాసితులను నిండా ముంచేశారని లోకేష్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు 19 లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలవరం ముంపు నిర్వాసితులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకుంటున్నారు నారా లోకేష్.












Click it and Unblock the Notifications