అయ్యన్న అడ్డాలో మున్సిపల్ బరిలో తోడికోడళ్ల సవాల్..!!
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మున్సిపల్ పోరు కూటమి - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇప్పటికే కూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారైంది. అటు వైసీపీ తమ అభ్యర్ధులను ప్రకటిస్తోంది. ఇదే సమయంలో కొన్ని మున్సిపాల్టీల్లో కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో చింతకాయల కుటుంబానికి చెందిన తోడికోడళ్ల పోరు ఆసక్తిగా మారుతోంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల సమయమే ఉండటంతో.. అభ్యర్ధులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి 27 మంది అభ్యర్ధులను ప్రకటించారు. కూటమి పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు పూర్తి కావటంతో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో కొన్ని మున్సిపాల్టీల్లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బంధువులే రాజకీయ ప్రత్యర్థులుగా తల పడుతున్నారు. నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికరమైన సన్నివేశానికి తెరలేచింది. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థులుగా తోడికోడళ్ళు పోటీ పడుతున్నారు.

హోరా హోరీగా మారుతున్న ఎన్నికలు
నర్సీపట్నం టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థిగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతి ఖరారు కాగా వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థినిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు సొంత సోదరుడు వైసిపి నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు అర్ధాంగి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల అనిత ఖరారు అయ్యారు. పద్మావతి శుక్రవారం ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తే.. వైసీపీ అభ్యర్ది అనిత ఆదివారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించారు. నేరుగా చైర్ పర్సన్ అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉండడంతో పోటీ రసవత్తంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా.. ఆయన కుమారుడు విజయ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక.. ఇప్పుడు వారి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నిక మరింత ఉత్కంఠగా మారుతోంది.













Click it and Unblock the Notifications
