మావాడు సేఫ్ గా ఇంటికి రాకపోతే..: పెద్దిరెడ్డి స్ట్రిక్ట్ వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. రాయలసీమలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని పుంగనూరు, రాయచోటి నియోజకవర్గాల్లో అధికార తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణలు పతాకస్థాయికి చేరాయి. రాజంపేట వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగడం, ఆ వెంటనే రాయచోటిలో వాహనాలు తగలబడటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తోన్న సమయంలో ఈ వివాదం మొదలైంది. ఆయనను అడ్డుకోవడానికి టీడీపీ క్యాడర్ ప్రయత్నించింది. దీంతో రెండు పార్టీల నాయకులు, కార్యర్తల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. కాన్వాయ్ పై టీడీపీ నాయకులు రాళ్లు విసరడంతో మిథున్ రెడ్డితో పాటు ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసిందేనని, ఇది ఎంపీపై జరిగిన హత్యాయత్నమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి రక్షణ, క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మిథున్ రెడ్డిని సురక్షితంగా తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, జిల్లా అధికారులదేనని తేల్చి చెప్పారు.
మిథున్ రెడ్డి సేఫ్ గా తిరిగి రాకపోతే.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక ఎంపీకి కూడా సరైన భద్రత కల్పించట్లేదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు సహకరిస్తోన్న ప్రతి ఒక్క అధికారి, పోలీస్.. బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
మరోవంక.. పోలీసులు పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు తీవ్రతరం చేశారు. ఘర్షణలకు కారణమైన వారిని గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారణ ప్రారంభించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెబుతోన్నారు.













Click it and Unblock the Notifications
