అక్టోబర్ 20 వరకు విమానాలు రద్దు! డబ్బులు పూర్తి రీఫండ్
పశ్చిమాసియా ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు క్షీణించడంతో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలోని ప్రధాన పౌర విమానాశ్రయాలు, విమానయాన రవాణా మౌలిక వసతులపై హౌతీ దళాలు దాడులకు పాల్పడుతుండటంతో ఎయిర్ ఇండియా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రియాద్, దమ్మమ్, జెడ్డాలకు రాకపోకలు సాగించే తమ అన్ని విమాన సర్వీసులను అక్టోబర్ 20, 2026 వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షతకే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
సౌదీ అరేబియాలో మారిన పరిస్థితులపై ప్రకటన విడుదల చేసిన ఎయిర్ ఇండియా, తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భద్రతా పరిస్థితులు అనుకూలించి, సాధారణ స్థితి నెలకొన్న తర్వాత మాత్రమే మళ్లీ సర్వీసులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఇక విమానాల రద్దు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పూర్తి టికెట్ సొమ్మును రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, అకాసా ఎయిర్ వంటి ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా ఇప్పటికే సౌదీకి తమ సర్వీసులను నిలిపివేశాయి.

ఐసీఏవో తీవ్ర ఖండన..
పౌర విమానాశ్రయాలు, ప్రయాణికుల విమానాలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతకు, శాంతికి భంగం కలిగించేలా ఉన్న ఈ చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఐసీఏవో కౌన్సిల్ స్పష్టం చేసింది. అక్టోబర్ 10న రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక భారతీయుడు చికిత్స పొందుతూ మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరినట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
హౌతీ దళాల హెచ్చరికలు..
సౌదీ అరేబియా వైమానిక మార్గాలను ఏ క్షణమైనా లక్ష్యంగా చేసుకుంటామని, విదేశీ ప్రయాణికులు, అంతర్జాతీయ విమాన సంస్థలు సౌదీ విమానాశ్రయాలకు రాకుండా దూరంగా ఉండాలని హౌతీ దళాలు బహిరంగ హెచ్చరికలు జారీ చేశాయి. అయితే పవిత్ర నగరాలైన మెక్కా, మదీనా ప్రాంతాలకు మాత్రం మినహాయింపునిచ్చినట్లు ప్రకటించాయి. సైనిక దాడులు తీవ్రతరం కావడం, విమానాశ్రయాలు లక్ష్యంగా మారడంతో సౌదీ అరేబియాకు ప్రయాణించాలనుకునే వేలాది మంది భారతీయులు, ఉపాధి కోసం వెళ్లే కార్మికులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.














Click it and Unblock the Notifications
