రంగంలోకి పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ - రెస్క్యూ ఆపరేషన్స్..!!
విజయవాడలో వరద తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయమై మాట్లాడారు. పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. మరోవైపు లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
సహాయక చర్యలు
ఏపీ ప్రభుత్వం అభ్యర్దన మేరకు కేంద్రం స్పందించింది. ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులను వేగవంతంచేయడం జరిగింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్‌ను ప్రభుత్వం అందిస్తోంది.

బాధితులకు బాసట
ప్రైవేటు హోటల్స్, దుర్గ గుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చుతోంది. ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్ కొనసాగుతున్నాయి. చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకూ ఆహారం సిద్ధం చేసి అధికారులు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు శేష సాయి కల్యాణ మండపంలో లక్షల మంది వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం, విజయవాడ హోటల్స్ ఫుడ్ తయారు చేస్తున్నాయి.
నిరంతర పర్యవేక్షణ
లక్ష మందికి టిఫిన్.. లక్ష మందికి భోజనాన్ని హోటల్స్ యంత్రాంగం అందిస్తోంది. రాత్రి నుంచి హుటాహుటిన వరద ప్రాంతాలకు ఫుడ్ సప్లై చేస్తోంది. ఇలా ఎవరికి తగినట్టుగా వారు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వర్షం తగ్గటంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. బుడమేరు వరద తీవ్రత ఈ సాయంత్రానికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications