బెజవాడ 'నయీం': తుపాకీతో బెదిరింపులు, సీరియస్‌గా తీసుకున్న సీపీ
అమరావతి: ఇటీవలే తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం మాదిరే విజయవాడలో ఓ వ్యక్తి సరికొత్త రాడీయిజానికి తెరలేపాడు. ప్రశాంతంగా ఉన్న ఉన్న నగరాన్ని తన బెదిరింపులతో వణికిస్తూ భూదందాలు, సెటిల్ మెంట్లకు శ్రీకారం చుట్టాడు.
పోలీసులతో ఎంచక్కా కలిసిపోయి వారితోనే సెటిల్‌మెంట్స్ చేయిస్తూ, సమాజంలోని పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు. దందాలో తన మాట వినని వారిని తుపాకీ బెదిరించడంతో పాటు సెటిల్ మెంట్ల ద్వారా ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ బెజవాడ 'నయీం' పేరు సంపాదించాడు.
అయితే ఇతడి బారిన పడిన కొందరు మూడు రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన డీసీపీ పాలరాజును విచారణాధికారిగా కూడా నియమించి, ఆగడాలపై నివేదికను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. నగరంలోని తూర్పు ప్రాంతంలో ఉండే ఇతను ఐదేళ్ల క్రితం వరకు సాధారణ మెకానిక్‌గా ఉన్నాడు.
అమరావతిలో భూదందా?
ఆ తర్వాత ఓ ఏసీ కార్ మెకానిక్ షాపు ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే భూదందాలు, సెటిల్ మెంట్లు మొదలుపెట్టాడు. తనకున్న పరిచయాలతో అతిపెద్ద సెటిల్‌మెంట్ కింగ్‌గా అవతరించాడు. నగరంలో ఎన్నో భూదందాలకు, సెటిల్‌మెంట్స్‌కు పాల్పడ్డాడు. ఇటీవలే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కూడా ఓ భూదందాను చేశాడు.
ఇతని సెటిల్‌మెంట్స్, భూ దందాల్లో పోలీసుల సహకారం పూర్తిగా ఉందని తెలిసింది. వారితో కలిసే ఇతను పెద్ద పెద్ద డీల్స్‌ను సెటిల్ చేస్తాడని సమాచారం. ఇతని ఫోన్‌లో దాదాపు 200మంది పోలీసు అధికారుల, ఉన్నతాధికారుల నెంబర్లు ఉన్నాయని తెలిసింది. విజయవాడ కమిషనరేట్‌లోని ఒక అధికారితో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.
అతని ద్వారానే ఇతను సెటిల్‌మెంట్స్ చేస్తాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 498-ఎ కేసులను డీల్ చేయటంలో దిట్ట. మహిళా పోలీస్‌స్టేషనలో ఉన్న ఒక అధికారితో కలిసి, ఇతను పెద్దఎత్తున సెటిల్‌మెంట్స్‌కు పాల్పడ్డాడు. పలువురు సీఐలకు నెలనెలా మాముళ్లు కూడా ఇస్తాడని సమాచారం.

తుపాకీతో బెదిరింపులు?
దందాలో భాగంగా ఇతగాడు తుపాకీతో సైతం బెదిరింపులకు పాల్పతున్నాడు. తన వ్యాపారానికి అడ్డువస్తున్నాడని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక కారు మెకానిక్‌ను, అతని భార్యను నగరంలోని కాళేశ్వరరావు రోడ్డులో ఈ నెల 6వ తేదీ రాత్రి తుపాకీతో బెదిరించాడు.
షాపు ఖాళీ చేయాలని లేకపోతే.. అంతుచూస్తానని హెచ్చరికలు జారీచేశాడు. ఈ హఠాత పరిణామానికి ఒక్కసారిగా భయబ్రాంతులైన ఆ దంపతులిద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. తరువాత తేరుకుని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు.
కేసు వద్దంటూ హైదరాబాద్ నుంచి ఒత్తిడి?
దీంతో సూర్యారావుపేట స్టేషనలో కేసు నమోదైంది. సాధారణంగా దందాలు, సెటిల్ మెంట్లు చేసే వారికి అధికార పార్టీ అండ ఎలాగూ ఉంటుంది. ఈ సందర్భంలో ఇతనిపై ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేయవద్దని పోలీస్ ఉన్నతాధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడిని తీసుకొచ్చాడు.
రాజకీయ నాయకులతోపాటు, హైదరాబాద్‌కు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దంటూ ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎవరు చెప్పినా వినని సీపీ సవాంగ్ ఇతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు ఇతగాడికి తుపాకీ లైసెన్స్ ఎవరిచ్చారు?
ఓ మెకానిక్‌కు లైసెన్సడ్ రివాల్వర్ ఇవ్వటం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ మధ్య కాలంలో నగరంలో గన్ లైసెన్సలు ఇవ్వటం లేదు. ఎమ్మెల్యే బొండా ఉమాకు ఇటీవలే ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దరఖాస్తు పరిశీలనలో ఉంది. నిబంధనల ప్రకారం ఎవరైనా ఆత్మరక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి లైసెన్సను జారీచేస్తారు.












Click it and Unblock the Notifications