పోలవరం: తెరపైకి కొత్త అంశం, కేంద్రం ఏంచెప్పినా బాబు ఓకే! 'పులివెందులకే ఇచ్చా'
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. టెండర్ల బదులు కన్సార్టియం ద్వారా ముందుకు వెళ్లాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. కన్సార్టియం ద్వారా ఇతర కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో పనులు చేయాలని భావిస్తున్నారు.
కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో కన్సార్టియం ద్వారా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. త్రిసభ్య కమిటీ సిఫార్సులతో ధరలు పెంచుకునే అవకాశం ఉండనుంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం ప్రతిపాదన ఏదైనా ఓకేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు.

జగన్‌కు అవగాహన లేదు
చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నదుల అనుసంధానంపై వైసిపి అధినేత వైయస్ జగన్‌కు అవగాహన లేదన్నారు. అలాంటి జగన్, ఆయన పార్టీ నేతలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నాకే ఎన్నో డౌట్స్ ఉన్నాయి
40 ఏళ్లుగా ఇరిగేషన్ పైన తనకు అవగాహన ఉందని, అలాంటి తనకే ఎన్నో డౌట్స్ ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై అవగాహన తెచ్చుకొని మాట్లాడాలని హితవు పలికారు.

ఏడు మండలాలు రాకుంటే పోలవరం ఊహకే అందేది కాదు
ఏడు ముంపు మండలాలు రాకపోతే పోలవరం మన ఊహకు కూడా అందేది కాదని చంద్రబాబు అన్నారు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుందన్నారు.

నేను సమాధానం చెప్పాలా
పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నామని, రోజువారీ లెక్కలు చెబుతుంటే మళ్లీ శ్వేతపత్రం ఏమిటని ఆయన నిలదీసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టును అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నానని, అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. పులివెందులలో నీటి కష్టాలు తొలగించానని, అలాంటి వైసిపికి నేను సమాధానం చెప్పాలా అన్నారు.












Click it and Unblock the Notifications