నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-కమిషన్ కార్యదర్శి వాణీమోహన్‌పై వేటు-సెకండ్ వికెట్
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఎన్నికల కమిషన్‌కూ, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో ఉద్యోగులు నలిగిపోతున్నారు. అరవమంటే కప్పకు కోపం, కరవమంటే పాముకు కోపం అన్నట్లు మారిపోయిన పరిస్ధితుల్లో ప్రభుత్వం మాట వినాలో, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాట వినాలో ఉద్యోగులకు అర్ధం కావడం లేదు. ఈ కరమంలో రేపోమాపో రిటైర్ అయి వెళ్లి పోయే నిమ్మగడ్డను కాదని ప్రభుత్వానికి సహకరిస్తున్న ఉద్యోగులపై వరుసగా వేటు పడుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘంలో జేడీగా ఉన్న సాయిప్రసాద్‌పై చర్యలు తీసుకున్న ఎస్‌ఈసీ.. ఇవాళ కమిషన్ కార్యదర్శి వాణీమోహన్‌పై వేటు వేశారు.
నిమ్మగడ్డ హయంలో ఎన్నికలు- సర్కారు భయం అదేనా ?- స్ధానిక పోరు మొదలైతే కష్టమే..


ధిక్కారంపై నిమ్మగడ్డ సీరియస్
రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను బహిష్కరించాలన్న ప్రభుత్వ ఉద్ధేశం మేరకు వ్యవహరిస్తున్న ఉధ్యోగులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కన్నెర్ర చేస్తున్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కై తాను చెప్పినట్లు వినని అధికారులపై వేటుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితమే ఎన్నికల సంఘంలో జాయింగ్ డైరెక్టర్‌గా ఉన్న సాయిప్రసాద్‌పై ఆయన వేటు వేశారు. ఆయన్ను మరే ప్రభుత్వ శాఖలో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు అదే క్రమంలో మరో కీలక ఉద్యోగిపై ఆయన వేటు వేయడం కలకలం రేపుతోంది.

వాణీమోహన్‌కు ఉద్వాసన- రెండో వికెట్
ప్రస్తుతం ఎన్నికల సంఘం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి వాణీ మోహన్‌పై తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వేటు వేశారు. కమిషన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్న కారణంతో వాణీ మోహన్‌ను తప్పిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు ఆమెను వెంటనే రిలీవ్ కూడా చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో ఎన్నికల కమిషన్‌లో రెండో ఉద్యోగిపై వేటు పడినట్లయింది. వరుస ఉద్వాసనల వ్యవహారం మిగతా ఉద్యోగుల్లో సైతం కలకలం రేపుతోంది.

సర్కారుకు వాణీ మోహన్ సరెండర్
ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడటం లేదన్న కారణంతో తప్పించిన వాణీ మోహన్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వాణీ మోహన్‌ను తక్షణం రిలీవ్ చేస్తున్నామని, ఆమెను ప్రభుత్వానకి సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో వాణీ మోహన్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆమెను ఏ బాధ్యతల్లో ఉంచాలో ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.